చిరంజీవిని కావాలనే ఆహ్వానించలేదు: బన్నీ

మెగా కాంపౌండ్ లో ఈవెంట్ ఏదైనా జరిగితే దానికి చిరంజీవి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మెగాభిమానులతో పాటు కాంపౌండ్ హీరోలందరికీ చిరంజీవి రావడమే కావాలి. కానీ బన్నీ మాత్రం తన సినిమా ఫంక్షన్ కు చిరంజీవిని కావాలనే ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు.

డీజే ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి కచ్చితంగా వస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. యూనిట్ సభ్యులు కూడా అదే చెబుతూ వచ్చారు. చిరంజీవి కూడా ఫ్రీగానే ఉన్నారు. రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

కానీ డీజే యూనిట్ నుంచి చిరంజీవికి ఆహ్వానం అందలేదు. మెగాస్టార్ ను మాత్రమే కాదు, డీజే సినిమాతో సంబంధం లేని ఏ వ్యక్తినీ ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించలేదంటున్నాడు బన్నీ.

దర్శకరత్న దాసరి మరణంతో పరిశ్రమలో నిశ్శబ్ద వాతావరణం ఉందని, అలాంటి టైమ్ లో తమ సినిమా ఫంక్షన్ కు ప్రముఖుల్ని పిలిచి వేడుక చేయడం ఇష్టంలేకనే, చిరంజీవితో సహా ఎవర్నీ ఆహ్వానించలేదని క్లారిటీ ఇచ్చాడు బన్నీ. డీజే ఆడియో ఫంక్షన్ చూస్తే సినిమాతో సంబంధం లేని ప్రముఖులు ఎవరూ కనిపించరని అంటున్నాడు.

పోనీ ఆడియో ఫంక్షన్ ను రద్దుచేద్దామంటే, అప్పటికే సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డంతో.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను పెట్టాల్సి వచ్చిందంటున్నాడు బన్నీ. కానీ నిజంగా దాసరి మృతికి సంతాపంగా ఫంక్షన్ రద్దు చేయాలనుకుంటే డీజే టీం ఆ పని చేసి ఉండొచ్చు.

ఎందుకంటే, మెగా కాంపౌండ్ కు అలవాటైన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టుకోవడానికి అప్పటికి మరో వీకెండ్ ఉండనే ఉంది. కానీ డీజే యూనిట్ మాత్రం ఆ పని చేయలేదు.

మరీ ముఖ్యంగా దాసరి చనిపోయినప్పటికీ.. డీజే ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి వస్తే ఎవరూ ఆక్షేపించరు. ఎందుకంటే మెగా కాంపౌండ్ కు చిరంజీవి పెద్ద దిక్కు. ఆ కాంపౌండ్ కు చెందిన హీరో సినిమా ఫంక్షన్ కు చిరంజీవి రావడం అనేది అత్యంత సహజం.

Show comments