తాప్సీకి వస్తే అలా, రాకపోతే ఇలా.!

అవార్డులొస్తే ఎగిరి గంతేయడం, రాకపోతే డీలా పడిపోవడం సినీ తారలకు మామూలే. తాప్సీ ఇందుకు మినహాయింపేమీ కాదు. మొన్నామధ్య 'పింక్‌' సినిమాపై ప్రశంసల జల్లు కులవడం, అవార్డులు వెల్లువలా వచ్చిపడ్డంతో, 'నాకు నిజమైన గుర్తింపు ఇప్పుడే వచ్చింది..' అంటూ తాప్సీ ఎగిరి గంతేసింది. 

సౌత్‌ సినిమాల్లో హల్‌చల్‌ చేసి, ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాల్లో సందడి చేస్తోన్న తాప్సీ, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, సౌత్‌ సినిమాలపై వీలు చిక్కినప్పుడల్లా సెటైర్లు వేస్తూనే వుంది. సౌత్‌ సినిమాల్లో హీరోయిన్లకు గుర్తింపు వుండదనీ, ఎక్స్‌పోజింగ్‌ తప్ప అక్కడ నటనకు ఛాన్స్‌ వుండదనీ ఏవేవో ఆరోపణలు పనిగట్టుకుని చేసింది సౌత్‌ సినిమా మీద తాప్సీ. తాజాగా, సౌత్‌లో తనకు నటిగా సరైన గుర్తింపు ఇవ్వలేదనీ, ఎన్నో సినిమాలకు అవార్డులను ఆశించి భంగపడ్డానని వాపోయిందీ బ్యూటీ. 

అన్నట్టు, 'పింక్‌' సినిమాలో తన నటనకి జాతీయ అవార్డ్‌ని ఆశించిందట తాప్సీ. అది కాస్తా దక్కకపోవడంతో, 'ఇక్కడ గ్రూపులు కడితేనే అవార్డులు..' అంటూ అసహనం వ్యక్తం చేసింది. అవునా, అలాగైతే 'పింక్‌' సినిమాకి అవార్డులెలా వచ్చాయ్‌.? అని బాలీవుడ్‌ సినీ జనం ప్రశ్నిస్తున్నారు. 'పింక్‌' సినిమా వ్యక్తిగత అవార్డుల పరంగా నిరాశపర్చిందనీ, 'నామ్‌ షబానా' ఆ ఆశ తీర్చుతుందని ఆశిస్తున్నాననీ తాప్సీ చెబుతోంది. 

Show comments