'పశ్చిమ'కు పెద్దపీట....'తూర్పు'పై చిన్న చూపు!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గోదావరి జిల్లాలపై చంద్రబాబు భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో కీలకమైన తూర్పు గోదావరి జిల్లాకు మంత్రివర్గంలో మొండిచెయ్యి లభించింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరికి ఉద్వాసన పలికి, ఇరువురికి కొత్తగా అవకాశం కల్పించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా అతిపెద్ద జిల్లాగా అవతరించింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ జిల్లాపై చిన్నచూపు చూశారంటూ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. మంత్రివర్గ కూర్పుపై జిల్లాకు చెందిన ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇంకోవైపు పార్టీ శ్రేణుల్లో కూడా విస్తరణపై అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. ఫలానా నేతకు మంత్రిపదవి పందుకు ఇవ్వలేదన్న అంశాన్ని పక్కనపెడితే జిల్లాలో విధిగా మరొకరికి కేబినేట్‌లో చోటు కల్పించాల్సి ఉందని, అయినప్పటికీ ఆ ఊసే ఎత్తలేదంటూ అధినేత చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 తూర్పుగోదావరి జిల్లా నుండి ప్రస్తుతం బీసీ సామాజికవర్గం నుండి యనమల రామకృష్ణుడు, కాపు సామాజికవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో చినరాజప్ప పెద్దాపురం ఏమ్మెల్యే కాగా, రామకృష్ణుడు ఏమ్మెల్సీ కోటాలో మంత్రిపదవి పొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశానికి అనూహ్యమైన విజయం లభించింది. ఆ ఎన్నికల్లో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్‌ స్థానాలు సహా మెజారిటీ అసెంబ్లీ సీట్లు తేదేపా వశమయ్యాయి. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు గాను కొత్తపేట, రంపచోడవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, నియోజకవర్గల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. టీడీపీ రెబల్‌గా పిఠాపురం నుండి పోటీ చేసిన ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ విజయం సాధించి, తిరిగి తెలుగుదేశం గూటికి చేరారు. 

దీంతో అప్పట్లో టీడీపీ అభ్యర్ధుల సంఖ్య 14కు చేరింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 16కు చేరింది. అధికార పార్టీకి ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలున్న జిల్లా రాష్ట్రంలో మరొకటి లేదనే చెప్పాలి! ఇదిలావంటే గత కాంగ్రెస్‌ హయాంలో జిల్లా నుండి ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించారు. కాపు, శెట్టిబలిజ, దళిత సామాజికవర్గాల నుండి ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే (చినరాజప్ప) మంత్రి పదవిలో ఉన్నారు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే కేబినేట్‌లో చోటు దక్కకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజమహేంద్రవరం రూరల్‌ పమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజీనామా చేయడం దేశం వర్గాల్లో కలకలం లేపుతోంది. తెలుగుదేశం హయాంలో గతంలో కమ్మ సామాజికవర్గం నుండి గోరంట్ల మంత్రిగా పనిచేశారు. 

ఆ సంప్రదాయాన్ని చంద్రబాబు తిరిగి నెలకొల్పుతారని గోరంట్ల తుదకు భంగపాటుకు గురయ్యారు. దీంతో చంద్రబాబు తీరును నిరిసిస్తూ పార్టీని ఎక్కడకు తీసుకువెళ్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపదవి లభిస్తుందన్న ఏకైక కారణంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన జ్యోతుల నెహ్రుకు విస్తరణలో చుక్కెదురయ్యింది. తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరిన వేర్వేరు జిల్లాలకు చెందిన నలుగురికి కేబినేట్‌లో చోటు కల్పించి, తనకు మాత్రం అన్యాయం చేశారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదంటూ తన సన్నిహితుల వద్ద జ్యోతుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి కూడా మంత్రిపదవులను ఆశించి భంగపడ్డారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పిఠాపురం ఏమ్మెల్యే పస్‌విఎస్‌ఎన్‌ వర్మ, కాకినాడ సిటీ పమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితరులు మంత్రి పదవులను ఆశించి భంగపడ్డారు. 

Readmore!

ఇక పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఊహించినట్టే పీతల సుజాతకు ఉద్వాసన పలికారు. మంత్రిగా సుజాత అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో బాబు ఆమెను తొలగించారు. అయితే కొత్తగా జవహార్‌, పితాని సత్యనారాయణకు మంత్రి పదవులు ఇచ్చారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో అసమ్మతివాదులపై ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో నేతల్లో అసంతృప్తి, అలకలు సహజమేనని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణను సామాజిక అంశాలు, ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చేపట్టారన్నారు. మంత్రి పదవులు లభించలేదన్న కారణంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలతో తమ అధినేత చంద్రబాబు సంప్రదిస్తారని, అవన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు.

Show comments