ఇప్పటి వరకూ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత ఐదువందల, వెయ్యి రూపాయల నోట్ల విలువ 11.5 లక్షల కోట్లు అని తెలిపారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్. ఇదే సమయంలో ఈ మనిషి చెప్పిన మరో గణాంకం.. కొత్త నోట్ల ముద్రణ గురించి. తాము ఇప్పటి వరకూ నాలుగు లక్షల కోట్ల రూపాయల నోట్లను బ్యాంకులకు చేర్చామని చెప్పాడు!
మారకంలోని నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దాదాపు నెల కావొస్తోంది. ఇంత కాలానికి మీడియా ముందుకు వచ్చిన ఆర్బీఐ గవర్నర్.. ఇప్పటి వరకూ తాము బ్యాంకులకు చేర్చిన కొత్త నోట్ల విలువ, తమ దగ్గర డిపాజిట్ అయిన మొత్తంలో మూడో వంతే అని చెబుతున్నారు!
ముప్పై రోజులు గడిచిన తర్వాత కూడా ఇంకా మూడో వంతు నోట్లను మాత్రమే బ్యాంకులకు అందజేశామని నిస్సిగ్గుగా ప్రకటించుకుని.. గర్వపడ్డారీయన! మారకంలో ఉన్న డబ్బులో కేవలం మూడోవంతును మాత్రమే వినియోగించుకునే హక్కు ప్రజలకు ఉంది.. అని చెప్పుకోవడానికైనా సిగ్గు వేయడం లేదా! ఇదేం ప్రభుత్వం.. ఈయనేం ఆర్బీఐ గవర్నర్!
ఇలా వచ్చిన నాలుగు లక్షల కోట్ల నిధుల్లో.. బీజేపీ నేతల, కేంద్రమంత్రుల ఇళ్లల్లో జరిగిన పెళ్లిళ్లకు వినియోగించిన సొమ్ము ఎంత? అక్రమార్కులు, నల్ల దొంగలు తమ తమ మార్గాల్లో పొందిన కొత్త నోట్ల విలువ ఎంత? ఈ విషయాల గురించి కూడా వివరించి ఉంటే బాగుండేంది. రోజుకు రెండు వేల రూపాయల పరిమితి మేరకు.. వేతన జీవులు, వచ్చిన రెండు వేల రూపాయల నోటును ఏం చేసుకోవాలో అర్థం కాని గందరగోళ స్థితిలోనే కొనసాగుతోంది దేశం.
ఇలాంటి సమయంలో.. తామేదో ఘనకార్యం సాధించినట్టుగా మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. రెండు వేల రూపాయల నోటుకు చిల్లర ఇవ్వమంటే.. నూర్రూపాయలు కమిషన్ ఇస్తారా? అని ఆర్టీసీ కండక్టర్ల దగ్గర నుంచి బ్యాంకు ఉద్యోగుల వరకూ వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల దగ్గర నుంచి, ఆర్థిక ఉగ్రవాదుల వరకూ అందరి చేతికీ కొత్త నోట్లు చేరిపోయాయి. ఎటొచ్చీ సామాన్యుడు మాత్రం.. ఇంకా ఇక్కట్ల పాలవుతున్నారు.
మోడీ భక్తుల సంగతిని పక్కన పెడితే.. వాళ్ల భజన్ లను మినహాయిస్తే.. సామాన్యులు మాత్రం మోడీ కి శాపనార్థాలు పెడుతున్నారు. మా ఉసురు తగలకపోదని.. బ్యాంకుల క్యూ లైన్లలోనే నెలల కొద్దీ సమయాన్ని గడిపేస్తూ, నోట్ల రద్దు నిర్ణయంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు అంటున్నారు.