ముస్లిం చాందసవాదులకు అడ్డంగా దొరికిన బీజేపీ!

తమిళ సంప్రదాయాలను గౌరవిస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించేశారు. జల్లికట్టు పై నిషేధం ఎత్తివేయడం గురించి తమిళులు చేపట్టిన ఉద్యమానికి కేంద్రం దిగివచ్చింది. ఓటు బ్యాంకు రాజకీయాలు రాజ్యమేలుతున్న పుణ్యమో.. లేక తమిళుల పంతమో కానీ.. స్వయంగా మోడీ దిగొచ్చి ప్రకటన చేశారు. ఈ వ్యవహారాన్ని తమిళులు ఇగోగా తీసుకోవడం, రాజకీయ పార్టీలు సినిమా వాళ్లు ఈ వివాదంలో తమ అవకాశాలను వెదుక్కొంటూ.. దీన్ని పెంచి పెద్దది చేయడంతో.. కేంద్రం కూడా ఎందుకొచ్చిన తంటా అంటూ తగ్గింది!

ఆఖరికి సుప్రీం కోర్టు నిషేధాజ్ఞలకు కూడా విలువనివ్వకుండా కేంద్రం ‘సంప్రదాయానికే’ పెద్ద పీట వేస్తామని ప్రకటించేసింది! ఈ సంప్రదాయంలో పూర్వాపరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల మహత్యమే అనుకోవాలి. జల్లికట్టు పై నిషేధం ఎత్తేశాం కాబట్టి.. తమిళులు బీజేపీని ఆదరించేయాలని రేపటి ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసుకుంటుంది కూడా! అయితే ఈ క్రెడిట్ కోసం అక్కడ ఇప్పటికే చాలా మంది పోటీలో ఉన్నారు. సినిమా వాళ్లతో సహా!

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరో రకంగా ఇరకాటంలో పడింది. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నాం.. తమిళుల సంప్రదాయాన్ని స్వాగతిస్తున్నాం.. అంటూ స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించాడు. కోర్టు కాదన్న విషయంలో ఉద్యమానికి, వీధుల్లోకి వచ్చిన జనానికి, సంప్రదాయ వాదనలకే ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా ముస్లిం చాందసవాదులకు ప్లస్ అయ్యే విషయమే!

ఇప్పటికే ‘తలాక్’ వ్యవహారం  పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముస్లిం మత సంప్రదాయ ప్రకారం తలాక్ తో విడాకులు అయిపోవడాన్ని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తప్పుపడుతోంది. ఆ సంప్రదాయానికి చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వకూడదని కమలం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రమంత్రులు బహరంగంగా మాట్లాడారు. ‘తలాక్’ ను దుష్టసంప్రదాయంగా వారు చెప్పారు. విడాకుల విషయంలో ఉమ్మడి పౌరస్మృతి అని.. వారు సన్నాయి నొక్కులు నొక్కారు! తలాక్ సంప్రదాయాన్ని చట్టబద్ధంగా చెల్లనీయకుండా చూడటం ద్వారా వీర హిందుత్వవాదులం అనే గుర్తింపు తెచ్చుకోవాలనేది కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యుల ఆరాటం!

Readmore!

అయితే ముస్లిం ఛాందస వాదులు దానికి ఒప్పుకోవడం లేదు. తలాక్ తమ సంప్రదాయం అని.. ఉమ్మడి పౌరస్మృతి చెల్లదని వారు వాదిస్తున్నారు.. అయితే కేంద్రం మాత్రం ఆ వ్యవహారంలో తగ్గేది లేదంటోంది. యూపీ ఎన్నికల నేపథ్యంలో ‘తలాక్’ వ్యవహారంతో బీజేపీ రాజకీయ ప్రయోజనాన్ని పొందే యత్నం చేస్తుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

అయితే ‘జల్లికట్టు’ వివాదం పుణ్యమా అని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ముస్లిం చాందస వాదుల చేతిలో అడ్డంగా బుక్ అయ్యింది. జల్లికట్టుపై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని సంప్రదాయం పేరుతో ఎత్తేస్తున్నారు.. స్వయంగా ప్రభుత్వమే ఆ క్రీడను ఆడించే ఏర్పాట్లు చేస్తున్నారు.. సంప్రదాయానికి అంత విలువ ఉన్నప్పుడు.. ‘తలాక్’ కు మాత్రం చట్టబద్ధత ఎందుకు ఇవ్వరు? అని ముస్లిం మతంలోని సంప్రదాయ వాదులు ప్రశ్నించవచ్చు. ఇదే వాదనను కోర్టు ముందు కూడా వినిపించవచ్చు!

మరి తమిళుల సంప్రదాయానికే విలువ.. ముస్లింల సంప్రదాయాలకు విలువ ఉండదు.. అని కమలనాథులు వాదించగలరా? అప్పుడు వీరి  వెర్షన్ కు విలువ ఉంటుందా? సంప్రదాయం పేరుతో చాందసత్వానికి మద్దతుగా నిలిచినప్పుడు.. అన్ని రకాల చాందసాన్నీ ఒప్పుకోవాల్సిందే. లేకపోతే.. ‘సంప్రదాయం’ దెబ్బతింటుంది సుమా!

Show comments