బాలయ్య పీఏ లొల్లి.. అసలు వాటాలు వసుంధరకా?!

నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేగారి పీఏ విశ్వరూపం గురించి వార్తలు కొత్తవేమీ కావు. ఈయన వసూళ్ల దందా గురించి గత రెండేళ్ల నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతిదానికీ ఒక రేటు ఉందని.. రాజకీయ సిఫార్సులతో ముడిపడిన ప్రతి పనికీ చదవింపులు చదివించుకోవాల్సిందే అని, ఇలాంటి వ్యవహారాలన్నింటినీ బాలయ్య పీఏ శేఖర్ కనుసన్నల్లో నడిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

మరి ముందుగా ప్రతిపక్షాల వాళ్ల, తటస్థులు బాలయ్య పీఏ పై ఆరోపణలు మొదలుపెట్టగా.. ఇటీవలి కాలంలో తెలుగు తమ్ముళ్లే ఈ విషయంలో రోడ్డుకు ఎక్కారు! మాజీ ఎమ్మెల్యేలు, హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం నేతలు.. ఈ విషయంలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి.. బాలయ్య పీఏ తీరును వారు నిరసిస్తున్నారు. పీఏను సాగనంపాల్సిందే అని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలయ్య పీఏ ఏ పనికి ఎంత వసూలు చేస్తున్నాడో కూడా తెలుగుదేశం నేతలే ఏకరువు పెట్టడం! వృద్ధాప్య, వికలాంగ పెన్షనర్ల జాబితాలో స్థానం కోసం రెండువేల రూపాయలు, సబ్సిడీ రుణంతో కట్టించే ఇంటి రుణాల కోసం  పాతిక వేల రూపాయలు, వేరే సబ్సిడీల సిఫార్సుల కోసం కనీసం ఇరవై వేల రూపాయలు.. ఇలా వసూళ్లు జరుగుతున్నాయని, నియోజకవర్గంలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని శేఖర్ ఈ వసూళ్లను చేయిస్తున్నాడని తెలుగు తమ్ముళ్లే ఆరోపిస్తున్నారు.

ఇలా ఆరోపిస్తున్న వాళ్లేమీ పార్టీకి కొత్త వారు కూడా కాదు. మాజీ ఎమ్మెల్యేలే ఈ జాబితాలో ఉన్నారెయె! వీళ్లంతా కలిసి సమావేశాలు నిర్వహించి బాలయ్య పీఏ ను నిరోధించాలని, ఆయనను నియోజకవర్గం నుంచి పంపించి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు!

ఒక రోజు కాదు.. ఇప్పటి వరకూ వీళ్ల సమావేశాలు చాలానే జరిగాయి. గ్రామస్థాయిల్లో సర్పంచులను, మండల స్థాయిల్లో తెలుగుదేశం నేతలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, కేవలం పీఏ శేఖర్ ఏజెంట్లు చెబితేనే అన్ని పనులూ జరుగుతుంన్నాయని తమ్ముళ్లు వాపోతున్నారు. వసూళ్ల అవకాశం తమకు ఇవ్వడం లేదు.. అంతా శేఖరే దోచుకుపోతున్నాడనేది వీళ్ల ఆందోళన!

మరి ఒక సెలబ్రిటీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, అందునా ఎన్టీఆర్ తనయుడు , చంద్రబాబు వియ్యంకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి స్వయనా తెలుగుదేశం నుంచి ఇలాంటి ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. అయితే.. ఇంత జరుగుతున్నా, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇంత వరకూ ఈ వ్యవహారం గురించి అధికారిక స్పందన లేదు!

తను నియోజకవర్గ ప్రజలకు అపారమైన సేవలు చేస్తున్నాను అని, అనునిత్యం వారితో టచ్ లో ఉంటాను అని చెప్పుకునే నందమూరి బాలకృష్ణ తన వాళ్లు, తన పార్టీ వాళ్ల నుంచి వస్తున్న మాటల గురించే స్పందించడం లేదు! డైరెక్టుగా పీఏ పేరును చెబుతూ ఆయనను పంపించేయాలని తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నా.. బాలయ్య స్పందించడం లేదు! మరి ఏంటి అసలు కథ? అని ఆరా తీస్తే.. పీఏ వసూళ్లలో బాలయ్య కుటుంబానికే వాటాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది!

పీఏ తీరుపై గరం అవుతున్న తెలుగుదేశం నేతలే ఈ విషయాన్ని మీడియాకు లీకుగా ఇస్తున్నారు. బాలయ్య పీఏ శేఖర్ ఇంతలా తెగించడానికి నందమూరి కుటుంబమే కారణం అని వారు అంటున్నారు. ఇక్కడ వసూళు చేస్తున్న ప్రతి రూపాయికీ పైన లెక్కలున్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. బాలయ్య సతీమణి వసుంధర ఈ వసూళ్ల వ్యవహారాన్ని సమీక్షిస్తున్నారని.. వీరు అంటున్నారు. శేఖర్ ధైర్యం కూడా ఇదే అని వీరు చెబుతున్నారు. వసుంధర ఉందన్న ధీమాతోనే ఆయన వసూళ్లకు పాల్పడుతున్నాడని, కొంత ఆమెకు సమర్పించుకొంటూ.. తన దందాను కొనసాగిస్తున్నాడని తెలుగుదేశం అసమ్మతి నేతలు చెబుతున్నారు.

పీఏ శేఖర్ పై చర్యలు ఉంటాయని తాము అనుకోవడం లేదని, అలా జరగాలంటే.. బాలయ్య సతీమణి మాత్రమే ఆ పని చేయగలదని వీరు అంటున్నారు. అయితే ఎన్నికల్లో గెలవడానికి భారీ మొత్తం ఖర్చు పెట్టామనే భావనతో ఆమె ఉన్నారని, అలా పెట్టిన మొత్తాన్ని ఓట్లకు ఇచ్చిన నోట్లను పెట్టుబడిగా భావిస్తూ.. దాన్ని తిరిగి రాబట్టుకోవాలనే ఆలోచనతో ఆమె ఉన్నారని కూడా తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

అయితే.. ఈ వ్యవహారాన్ని తాము వదిలిపెట్టమని.. నిరసన తెలుపుతామని కూడా వారు చెబుతున్నారు. ఇరవై వేల మందితో భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించి శేఖర్ అక్రమాల గురించి చాటి చెబుతామని వారు తమ తదుపరి ప్రణాళికను వివరిస్తున్నారు! 

ఇలా ఉంది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పరిస్థితి. ఆయన భార్య ఆధ్వర్యంలో.. పీఏ శేఖర్ ప్రధాన ఏజెంటుగా వసూళ్లు జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లే అంటున్నారు. మరి ఈ విషయంలో బాలయ్య ఏం అనుకుంటున్నాడో! అయినా.. స్థానిక తెలుగుదేశం నేతలతోనే ఇలాంటి పేచీలు పెట్టుకుంటే, వారినే అసంతృప్త వాదులుగా తయారు చేసుకుంటే.. బాలయ్య రాజకీయ భవితవ్యానికి అది  అంత మంచిది కాదేమో! జనాల్లోని అసంతృప్తి మాత్రమే గాక, పార్టీలోనూ అసంతృప్త వర్గం తయారైతే కష్టం కదా! మరి ఈ లొల్లికి ఎలా పుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Show comments