కేసీఆర్‌ అండర్‌ ప్లే.. చంద్రబాబు జీరో ప్లే.!

తెలుగు రాష్ట్రాల్ని నోటు కష్టాలు కుదిపేస్తున్నాయి. వివిధ రంగాల్లో తీవ్ర నష్టాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంపై మింగలేక కక్కలేకపోతున్నారు. కాస్తో కూస్తో కేసీఆర్‌ బెటర్‌, కేంద్రంతో ప్రస్తుత పరిస్థితులపై కాస్తన్నా టచ్‌లో వుంటున్నారు. చంద్రబాబు పరిస్థితి మరీ దారుణం. నోట్ల రద్దు, మార్పిడి వ్యవహారాన్ని ముందుగానే స్వాగతించేయడంతో, ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించే పరిస్థితి లేదు. కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకుండాపోయింది. 

నోట్ల రద్దు - మార్పిడి వ్యవహారంతో కొన్ని పన్నులకు సంబంధించిన మొండి బకాయిలైతే వసూలవుతున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాలకు శుభపరిణామమే. అయితే, కరెన్సీ దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు కుదేలవడంతో తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతోందనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీదనే వుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గట్టిగానే నినదిస్తున్నారు. 

ఇక్కడ, కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు పకడ్బందీగా వున్నాయి. కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ తరహాలో కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించడంలేదాయన. నోట్ల రద్దు - మార్పిడి నిర్ణయంతో దేశ ఆర్థిక పరిస్థితి బాగు పడితే, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని చెబుతూనే, తెలంగాణలోనూ దేశంలోనూ నెలకొన్న పరిస్థితుల్ని కేంద్రానికి వినిపించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌, డిల్లీకి పయనమవుతున్నారు. 

చంద్రబాబు పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. ఎన్డీయే భాగస్వామి పక్షంగా కేంద్రం తీసుకునే నిర్ణయాల్ని పూర్తిస్థాయిలో సమర్థించాల్సిందే. ఒకవేళ కాదని, ప్రశ్నించినా.. చంద్రబాబు ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చే అవకాశమే లేదు. దాంతో, చంద్రబాబు ప్రశ్నలు 2000 రూపాయల నోటు ఎందుకు.? అన్న కోణంలో తప్ప, ఇతరత్రా అంశాల చుట్టూ ఆయన మాట్లాడలేకపోతున్నారు. 

Readmore!

కేసీఆర్‌ అయినా, చంద్రబాబు అయినా తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం, ఈ రెండు రాష్ట్రాల కోసం ఎలాంటి ప్రత్యేక చర్యలూ తీసుకునే అవకాశమే లేదు. కానీ, చంద్రబాబు తీరు పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో అసహనం వ్యక్తమవుతోంటే, కేసీఆర్‌ తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదో టైపు పొలిటికల్‌ స్ట్రాటజీ. 

దేశంలో పరిస్థితులు ఇంకో వారం పది రోజుల్లో పూర్తిగా మెరుగుపడ్తాయని కేంద్రం భరోసా ఇస్తోంది. ఈలోగా కేసీఆర్‌, ఢిల్లీకి వెళ్ళడం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవడం జరిగిపోతాయి. మరి, చంద్రబాబు తదుపరి రాజకీయ వ్యూహాలు ఎలా వుంటాయి.? కేంద్రంలో వున్నది తాము మద్దతిచ్చిన ప్రభుత్వమే గనుక, తూతూ మంత్రంగానే అయినా చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టకుండా వుంటారా.? చెయ్యాలి మరి తప్పదు.

Show comments