బాబుగారి స్పీడుతో చినబాబుకే షాక్‌.!

చంద్రబాబు సూపర్‌ స్పీడ్‌.. అవును, ఆయన పని తీరు అలాగే వుంటుంది. 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను..' అంటూ అధికారుల విషయంలో చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్యలు దుమారం రేపుతుంటాయి. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి 'సేవ' చేసినప్పుడూ, ప్రస్తుతం 13 జిల్లాల ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడూ చంద్రబాబు ఇదే తీరు.! 

మామూలుగా అయితే, చంద్రబాబుని సొంత పార్టీకి చెందిన నేతలే అభినందించేందుకు తటపటాయిస్తుంటారు. అందుకేనేమో, చంద్రబాబు తనను తానే అభినందించేసుకుంటుంటారు. 'నా వేగాన్ని ఎవరూ అందుకోలేరు.. నేను నిప్పులాంటోడ్ని.. మాట తప్పడం, మడమ తిప్పడం నాకు చేతకాదు.. నేనెవరికీ భయపడను..' అంటూ చంద్రబాబు తనకు తాను సర్టిఫికెట్లు ఇచ్చేసుకోవడం చూస్తూనే వున్నాం. 

'చేసిన మంచి పనుల గురించి చెప్పుకోకపోతే ఎలా.? పార్టీపైనా ప్రభుత్వంపైనా విమర్శలొస్తోంటే స్పందించరేం.? నన్ను ఇతరులు విమర్శిస్తోంటే మీరు ఊరుకుంటారా.?' అని చంద్రబాబు, పార్టీ వేదికలపై క్లాస్‌ తీసుకుంటే, అప్పుడు హడావిడిగా టీడీపీ నేతలు, మీడియా ముందుకొచ్చి.. బాబుగారి గొప్ప గురించి 'డబ్బా' కొట్టడం మామూలే. 

ఇక, అసలు విషయానికొస్తే.. చంద్రబాబుగారి పుత్రరత్నం నారా లోకేష్‌ ఈ మధ్య కొత్త మాట కనిపెట్టారు. 'నేను చంద్రబాబుగారి వేగాన్ని అందుకోలేకపోతున్నాను..' అన్నదే ఆ మాట. చంద్రబాబు వయసేంటి.? నారా లోకేష్‌ వయసేంటి.? 'నగదు బదిలీ' అనే కాన్సెప్ట్‌ని తన పుత్రరత్నమే తెరపైకి తెచ్చాడని అప్పట్లో చంద్రబాబు చెప్పుకొచ్చిన విషయం విదితమే. కానీ, చినబాబు నారా లోకేష్‌ మాత్రం, 'అబ్బే, నా తండ్రి వేగాన్ని అందుకోవడం నా వల్ల కాదు..' అంటూ తండ్రి భజనలో మునిగి తేలుతున్నారు.  Readmore!

ఏంటీ, చినబాబు నిజంగానే ఈ మాట అంటున్నారా.? లేదంటే టీడీపీ నేతలందరికీ క్లాస్‌ తీసుకున్నట్లే, తన భజన చేయమని చంద్రబాబే స్వయంగా తన పుత్రరత్నానికీ క్లాసులు తీసుకుంటున్నారా.? మూడేళ్ళవుతోంది రాజధాని లేదాయె.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్నారాయె.. ఏదీ, చంద్రబాబు ఎక్కడ 'వేగం' ప్రదర్శిస్తున్నారట.? ఏమో మరి, నారా లోకేష్‌కే తెలియాలి. 

Show comments