ప్రాణం ఖరీదు.. కట్టేదెవరు.?

'దేశ ప్రజలంతా మా నిర్ణయాన్ని హర్షిస్తున్నారు.. త్యాగాలకు ముందుకొస్తున్నారు..' 

- చట్ట సభల్లో కేంద్రం చెబుతున్న మాట ఇది. 

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన కరెన్సీ సంక్షోభం కారణంగా ఇప్పటికే 100 మంది వరకూ సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. నల్ల కుబేరుల్ని టార్గెట్‌ చేశామని చెప్పుకుంటున్న కేంద్రం పెద్ద పాత నోట్ల రద్దు ప్రక్రియను 'నల్లధనంపై సర్జికల్‌ స్ట్రైక్‌'గా అభివర్ణించిన విషయం విదితమే. ముందు దేశ ప్రజానీకమంతా ఇది నిజమేననుకున్నారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ అసలు విషయం అర్థమవుతోంది. జరిగిన సర్జికల్‌ స్ట్రైక్‌, సామాన్యుల్ని మట్టుబెట్టడం తప్ప, నల్ల కుబేరులకు ఎలాంటి హానీ చేయదని. 

తాజాగా పార్లమెంటులో పాత పెద్ద నోట్ల రద్దు వ్యవహారమై పెద్ద రచ్చ జరుగుతోంది. నిజానికి, ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో ఒక్క రోజు కూడా సజావుగా సాగలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తోంటే, విపక్షాలపై ఎదురుదాడితో సరిపెడ్తోంది అధికారపక్షం. నేటి సమావేశాల్లో అయితే, 'పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా 100 మంది వరకూ చనిపోయారు.. వారలా ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులెవరు.?' అని విపక్షాలు ప్రశ్నించాయి. 

ఈ ప్రశ్న ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిందేమీ కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోతే, చట్ట సభల్లో ఘనంగా నివాళులర్పించారు. 100 మంది సామాన్యులు, మోడీ నిర్వాకం కారణంగా చనిపోతే, కనీసం చట్ట సభల్లో కేంద్రం ఈ వ్యవహారంపై ఓ ప్రకటన చేయడానికి సిద్ధంగా లేకపోవడం శోచనీయం. సామాన్యుల ప్రాణాలకు నరేంద్రమోడీ సర్కార్‌ ఏ మేరకు విలువ ఇస్తోందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 

పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారం కేవలం నల్ల కుబేరుల్ని కాపాడటానికీ, సామాన్యుల్ని ఇబ్బందులపాల్జేయడానికి, అంతమొందించడానికి మాత్రమే.. అన్నట్లుంది పరిస్థితి. విపక్షాల డిమాండ్‌ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసి, ఘనంగా నివాళులర్పించేయడానికీ బహుశా కేంద్రం వెనుకాడబోదు.. కానీ, ఆ పని చేయడానికీ ఎందుకో ఈ అలసత్వం.?

Show comments