రొటీనే.. నోట్ల మార్పిడిలోనూ ప్రభుత్వం అట్టర్ ఫ్లాఫ్!

యుద్ధ ప్రాతిపదికన చర్యలు అన్నారు.. సంచలన నిర్ణయం అన్నారు.. మోడీ అన్నారు, మాస్టర్ స్ట్రోక్ అన్నారు.. ఏమైంది? ఏం జరుగుతోంది? రోజులకు రోజులు గడిచిపోతున్నాయి.. అయితే ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయడంలో, రద్దు చేసిన నోట్లను వెనక్కు తీసుకుని, కొత్త కరెన్సీని ప్రజల చేతిలో పెట్టడంలో, వారి అవసరాలకు తగ్గట్టుగా కాకపోయినా , కనీసం చెప్పిన మేరకు అయినా నోట్లను అందించడంలో ప్రభుత్వం, బ్యాంకులు దారుణంగా ఫెయిలవుతున్నాయి.

ఒకవైపు వ్యాపారాలు లేవు, తినడానికి, కొనడానికి శక్తి ఉన్నా, చేతిలో ఉన్న నోట్లు చెల్లకపోవడంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. నాలుగో రోజు.. కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. సామాన్య ప్రజల పాలిట సంచలనంలా, వాళ్లను ఆశ్చర్య పరుస్తూ మారకంలోని నోట్లు చెల్లవు అనేశారు. నల్లధనం కట్టడికి, ఉగ్రవాదం కట్టడికి అని చెప్పారు. రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవు.. ఈ రెండు రోజూలూ మీ పాట్లు మీరు పడండి.. తర్వాత మళ్లీ నగదరు మార్చుకునే అవకాశం ఇస్తామన్నారు.

నల్లధనం కట్టడికి, ఉగ్రవాదం కట్టడికి అనే సరికి.. సరేలే ఏదో మంచి పని ప్రజలంతా భావించారు. ఇక ఈ అంశం ముందే కొంతమందకి తెలుసు.. ఇది తుగ్లక్ నిర్ణయం అనే విమర్శలను ప్రజలు పెద్దగా లెక్క చేయలేదు. వారి దేశ భక్తి వారిని ఆ విధంగా ఆపింది.

రెండు రోజులు పోయాయి.. మరో  రెండు రోజులు కూడా గడిచినట్టే.. అయితే ఇప్పటి వరకూ అవసరానికి తగ్గట్టుగా ప్రజలకు కరెన్సీని అందించడంలో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు ఫెయిలవుతున్నాయి. నాలుగు వేల రూపాయల పరిమితి, రెండు వేల రూపాయలు మాత్రమే ఏటీఎంల నుంచి డ్రా చేయాలి.. అంటూ రకరకాల నియమాలు ముందస్తుగా పెట్టారు. అయితే ఆ మేరకు కూడా నగదును అందించలేకపోతున్నారు.

వాడుకోవడానికి డబ్బు కోసం.. రోజుల తరబడి క్యూల్లో నిలుచుకోవాల్సి వస్తోంది. చేతుల్లో ఉన్న డబ్బును డిపాజిట్ చేయడానికి మరో క్యూ. ఇక ఎంత సేపు క్యూలో ఉన్న దొరికేది నాలుగువేలే! ఆ డబ్బుతో ఏ మేరకు అవసరాలు తీరతాయి? పెళ్లిళ్లు, ప్రయాణాలు పెట్టుకున్న వారి పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్ని రోజులు?

ఇక కొన్ని బ్యాంకులు క్యాష్ లేదు అని అప్పుడే చేతులు ఎత్తేస్తున్నాయి. నాలుగు వేలు కూడా ఇవ్వలేం,  రెండు వేలు మాత్రమే ఇవ్వగలం అంటూ.. ఒక రెండు వేల రూపాయల నోటు చేతిలో పెట్టి పంపిస్తున్నాయి! దాన్ని తీసుకుని ఏం చేసుకోవాలి?! ఇక ఏటీఎంల పరిస్థితి సరేసరి! 

క్యూల్లో ఉన్న జనాలు ఇబ్బంది పడటమే కాదు.. కొన్ని చోట్ల ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ క్యూల్లో ఒక  వ్యక్తి మరణించాడు కూడా. మరోవైపు ఆసుపత్రుల దగ్గర పాత నోట్ల మార్పిడి విషయంలో కూడా వివాదం కొనసాగుతోంది. కొన్ని ఆసుపత్రుల వాళ్లు తీసుకోవడం లేదు. ఆసుపత్రులు తీసుకున్నా.. మెడికల్ షాపులు తీసుకోవడం లేదు. దీంతో రోగుల అవస్థలు తీవ్ర స్థాయికి చేరాయి.

నాలుగు వేల రూపాయల పరిమితి పెట్టి.. నాలుగో రోజుకు కూడా కొంత శాతం మంది ప్రజలకైనా ఆ డబ్బును అందించలేకపోతోంది ప్రభుత్వం. మరి సంచలన నిర్ణయం తీసుకుంటే చాలదు.. అందుకు తగ్గ ఏర్పాట్టు చేయకపోతే.. మొదటికే మోసం వస్తుంది. నాలుగో రోజుకూ పరిస్థితిని సరిదిద్దలేని ప్రభుత్వం తీరుతో.. పరిస్థితి ఎన్నటికి సద్దుమణుగుతుందో!

Show comments