జగన్‌ మాటే చంద్రబాబుకు వేదప్రమాణం అయిందా?

రజనీకాంత్‌ తన సినిమాల ద్వారా ఇప్పటికే చాలా బ్యూటిఫుల్‌ జీవిత సత్యాలను అనేకం జనంలోకి తీసుకువచ్చారు. అలాంటి వాటిలో ఒక పాప్యులర్‌ డైలాగ్‌ ఇలా ఉంటుంది.. ''చెడ్డవాడు ముందు గెలవొచ్చు.. కానీ చివరికి ఓడిపోతాడు. మంచివాడు ముందు ఓడిపోవచ్చు... కానీ చివరికి గెలుస్తాడు'' అని. 

'ఎవరు మంచి, ఎవరు చెడు' అని మనం డిసైడ్‌ చేసి చెప్పకుండా వదిలేసినట్లయితే.. ఇంచుమించుగా ఈ డైలాగును పోలినట్లుగానే ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకిచెందిన కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్‌ గజపతి రాజు ఇద్దరూ కూడా రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం అవసరమైతే తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధం అని అధినేత చంద్రబాబుకు పూచీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. 

ఏపీనుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉండడం మనకు మంచిదే! కానీ రాష్ట్ర ప్రగతికి అత్యంత కీలకమైన ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వంచనకు పాల్పడుతున్నప్పుడు.. వాళ్లిద్దరూ గనుక కేబినెట్‌కు రాజీనామాలు ఇచ్చినట్లయితే.. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి, ఒక మెట్టు దిగుతుందని, ప్రత్యేకహోదా దిశగా విజయం దక్కే అవకాశం ఉందని వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తొలినుంచి చెబుతూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లూ.. తెలుగుదేశం వారు ఆయన మాటల్ని ఎడాపెడా ఖండిస్తూ వచ్చారు. వారిద్దరికీ మంత్రి పదవులు ఉండడంచూసి జగన్‌ ఓర్వలేకపోతున్నాడని అన్నారు. భాజపా- తెదేపాల మధ్య బంధాన్ని తెంచడానికి ప్రయత్నిస్తున్నాడని దుమ్మెత్తిపోశారు. జగన్‌ను నానా మాటలూ అన్నారే తప్ప.. ఆయన చెప్పిన అసలు సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. 

పైగా చంద్రబాబు స్వయంగా రాజీనామాలు చేస్తే హోదా వస్తుందా? సామరస్యంగా పోవాలి.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. తీరా రెండేళ్లూ గడచిపోయాయి. ఇప్పటికి చంద్రబాబునాయుడుకు కూడా రోషం వంటి ఆవేశం వచ్చినట్లుంది. పార్టీ మంత్రులు రాజీనామాలకు సిద్ధం అని తనతో చెప్పిన తర్వాత.. మోడీతో భేటీ అయి, ఆయన స్పందనను బట్టి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు వార్తలు వచ్చాయి. మోడీ అపాయింట్‌మెంట్‌ ఇంకా ఇవ్వలేదు. ఇస్తారని కూడా గ్యారంటీ లేదు. ఎప్పటిదాకా గడువు పెట్టుకుంటారో తెలియదు. అదంతా మరో సంగతి. 

అయితే ఈ పరిణామం వల్ల తేలుతున్నదేంటంటే.. ''తాము రాజీనామాలు చేస్తే కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుందని'' తెదేపా మంత్రులు ఇప్పటికి బయటపడ్డారు. మరి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తొలినుంచి చెబుతున్న సంగతి అదే కదా! జగన్‌ మాటలను అపరిపక్వమైనవిగా కొట్టి పారేస్తూ... 'పిలగాడు' అని వ్యాఖ్యానిస్తూ.. చంద్రబాబునాయుడు మాటల మాయాజాలంలో జనాన్ని ఇన్నాళ్లూ మోసం చేయడానికి ప్రయత్నించినట్లే కదా అని జనం అనుకుంటున్నారు. 

Show comments