పిక్‌ టాక్‌: పవన్‌కళ్యాణ్‌తో ఎవరీయన.?

సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌, అమెరికా పర్యటనలో బిజీగా వున్నారు. హార్వార్డ్‌ యూనివర్సిటీ విద్యార్థుల సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకి వెళ్ళిన పవన్‌, ఆ యూనివర్సిటీలో ప్రసంగించనున్న విషయం విదితమే. కాగా, అమెరికా పర్యటనలో పవన్‌కళ్యాణ్‌ రాజకీయ కార్యకలాపాల్నీ చక్కబెట్టేస్తున్నారు. ఫొటోలో పవన్‌కళ్యాణ్‌తో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీవెన్‌ జార్డింగ్‌. రెండు గంటలపాటు వీరిద్దరి మధ్యా సమావేశం జరిగిందని జనసేన పార్టీ చెబుతోంది. 

ఇంతకీ, ఈ స్టీవెన్‌ జార్డింగ్‌ ఎవరంటే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కి అత్యంత సన్నిహితుడట. ప్రస్తుతం ఎన్నికల్ని ఫేస్‌ చేస్తోన్న అఖిలేష్‌ యాదవ్‌కి రాజకీయ సలహాదారుగా స్టీవెన్‌ జార్డింగ్‌ వ్యవహరిస్తున్నారన్నది జనసేన ఉవాచ. ప్రత్యేకంగా ఈ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరీ స్టీవెన్‌ హార్డింగ్స్‌ గురించి చెప్పడమంటే.. పవన్‌, 2019 ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారనే అనుకోవాలి. 

రాజకీయాలంటే ఎన్నికలు మాత్రమే కాదు.. అంతకు మించి అంటారు పవన్‌కళ్యాణ్‌. అదే సమయంలో, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామనీ చెబుతారు. ఆ వెంటనే అబ్బే, రాజకీయాలంటే గెలుపోటములు కాదనీ చెప్పడం పవన్‌కళ్యాణ్‌కే చెల్లింది. ఇంతకీ, స్టీవెన్‌తో పవన్‌ భేటీ.. 2019 ఎన్నికలకు సంబంధించేనా.? జనసేనకీ ఆయన సలహాదారుగా వ్యవహరిస్తారా.? ఏమో మరి, పవన్‌కళ్యాణ్‌ ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వాల్సి వుంటుంది. 

ఇదిలా వుంటే.. హ్యాంప్‌షైర్‌ గవర్నర్‌తో భేటీ, అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు లత మంగపూడి తదితరులతో సమావేశం, ఎన్నారైలు ఏర్పాటు చేసే విందు, అభిమానులతో మాటా మంతీ.. అబ్బో, పవన్‌ అమెరికాలో యమా బిజీ.. బిజీ బిజీ.!

Show comments