తెలుగుదేశంలో ‘కులం’ గోల!

ఒక మెతుకును పట్టుకుని చూస్తే చాలు.. అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుతిమెత్తగా తెలుగుదేశం పార్టీ  తీరుపై మాట్లాడిన మాటల పట్ల టీడీపీ నుంచి వచ్చిన రియాక్షన్ ను గమనిస్తే చాలు.. ఆ పార్టీలో పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది! ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ తీరుపై టీడీపీ అనుకూల వర్గాలు కొంచెం ఘాటుగా స్పందిస్తున్నాయి.

పవన్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన వాడు అయినప్పటికీ, ఇప్పటి వరకూ తెలుగుదేశం తో సాన్నిహితంగా మెలుగుతున్న వాడైనప్పటికీ, తెలుగుదేశం పార్టీపై ఘాటైన విమర్శలు చేసిన వ్యక్తి కానప్పటికీ.. పవన్ తెలుగుదేశం విజయంలో భాగస్వామి అంటే ఈ వర్గాలు ఒప్పుకోవు! ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని బాగా ఓన్ చేసుకునే సామాజికవర్గానికి చెందిన టీడీపీ ఫ్యాన్స్.. పవన్ ను పట్టించుకోనట్టుగా వ్యవహరించారు ఇన్ని రోజులు. అయితే రాజధాని విషయంలో, పాలన విషయంలో ఒక సామాజికవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు.. అని తెలుగుదేశం తీరుపై పవన్ సున్నితంగా చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం అభిమానుల్లో ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరింది.

సోషల్ మీడియాలో ఇలాంటి వారు పవన్ తీరుపై మండి పడుతున్నారు. ఇన్ని రోజులో.. సైలెంట్ గానే ఉండినా పవన్ మాట్లాడిన ఒక్క మాటతోనే వీరిలో అసహనం మొదలైంది. పవన్ పై సెటైర్లు వేస్తూ ఫేస్ బుక్ పోస్టులు పెట్టడం మొదలైంది ఇప్పటికే!

ఇక తెలుగుదేశం నుంచి అధికారిక స్పందనను పరిశీలిస్తే.. ఆ పార్టీ ‘అధికారిక’ సామాజికవర్గం నేతలు ఎవరూ స్పందించలేదు పవన్ విషయంలో. ఆ పార్టీలోని కాపు నేతలేమో.. పవన్ విషయంలో ఆచితూచి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తామన్నట్టుగానే మాట్లాడారంతా. పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించగానే.. పొత్తు పెట్టుకుంటాం, కలుపుకుపోతాం అని వీరు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ను వదులుకోమన్నట్టుగా వీళ్లు వ్యాఖ్యానించారు.

Readmore!

అయితే బీసీ వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు మాత్రం పవన్ విషయంలో ఘాటుగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలు సరికాదు.. ఏదో జరిగిపోతోందన్నట్టుగా మాట్లాడటం సరికాదు.. అని ఆయన అన్నాడు. తెలుగుదేశంలో స్పందిండం కూడా కుల సమీకరణాలకు అనుగుణంగా ఉంటుంది.

పవన్ విషయంలో ‘తెలుగుదేశం అధికారిక’ సామాజికవర్గం నేతలు వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారు. బీసీ నేతతో పవన్ పై దాడి చేయించారు, కాపు నేతలు ఆయింట్ మెంట్ రాస్తున్నారు! బీసీ నేత స్పందించడం వ్యూహాత్మకం. కాపు నేతలు మాత్రం కక్కలేరు మింగలేరు! ఇప్పటికే ముద్రగడ మీద మాటల దాడి చేసి.. సొంత సామాజికవర్గంలో వీరు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ విషయంలోనూ వీరు రెచ్చిపోలేరు. అయితే.. పవన్ మీద దాడి ముందుగా బీసీ నేతలతో మొదలుపెట్టించారు. ఇకపై పవన్ గనుక తీవ్రంగా స్పందిస్తే.. ఆ తర్వాత పవన్ ను తిట్టే బాధ్యతల్లోకి వచ్చేది కాపు నేతలు, ఆ సామాజికవర్గం మంత్రులే! 

Show comments