కొత్తనోట్లు గురూ: మన కన్నాముందు తీవ్రవాదుల చేతికి!

ఇంకా సగం భారతీయ జనాభా ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త కరెన్సీ ఎలా ఉంటుందో చూడనే లేదు. ఒకవైపు భారతీయులు వాటి కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టి ఉండగా.. తీవ్రవాదుల చేతికి మాత్రం అప్పుడే కొత్త నోట్లు చేరాయని స్పష్టం అవుతోంది. తాజాగా ఎల్వోసీ వద్ద భద్రతాదళాల కాల్పుల్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల వద్ద ఆర్బీఐ విడుదల చేసిన రెండు వేల రూపాయల నోట్లు లభ్యం అయ్యాయి. చొరబాటుకు యత్నించిన వాళ్లు కరెన్సీని తీసుకునే వచ్చారని స్పష్టం అవుతోంది.

ఉగ్రవాదుల వద్ద కొత్త కరెన్సీ కనిపించే సరికి భద్రతాదళాలు షాక్ కు గురి అయ్యాయి. ఉగ్రవాదుల వద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, బుల్లెట్లతోపాటు నోట్లు లభించాయి. వీటిలో కొన్ని పాత ఐదు వందల రూపాయల నోట్లు ఉండగా.. రెండు వేల రూపాయల నోట్లు మరి కొన్ని ఉన్నాయి.

మరి కొత్త నోట్లు బ్యాంకుల వద్దకు వచ్చి రెండు వారాలు అవుతోంది. కానీ ఇంతలోనే ఇవి దేశం దాటి, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదుల వద్ద కనిపిస్తున్నాయి. ఈ రెండు వేల రూపాయల నోట్లు ఒరిజినలా? లేక ఇప్పటికే పాక్ లో భారతీయ కరెన్సీలోని కొత్త నోట్లకు నకిలీని సృష్టించేసి.. ఈ ఉగ్రవాదుల చేతికి ఇచ్చి పంపుతున్నారా? అనే అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది.

అయినా.. బోలెడన్ని పరిమితులు పెట్టి నాలుగు వేలే ఇస్తాం, రెండు వేలే ఇస్తాం అని.. సామాన్యులను ప్రభుత్వం హింసిస్తోంటే.. ఇలా ఉగ్రవాదుల దగ్గర మాత్రం కొత్త నోట్లు దక్కడం విస్మయాన్ని కలిగించే అంశం.   

Show comments