ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రులకు ఒక చరిత్ర, ఒక విశిష్టత లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఎందరో ప్రముఖుల త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ఒక గుర్తింపు లేకుండా చేస్తున్నానన్న స్పృహతో ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆవిర్భావ దినోత్సవాలు ఉంటాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఆవిర్భావదినం ఉండదట. ఇది చంద్రబాబు గారి కొత్త చరిత్ర అనుకోవాలి. జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటుంది. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
దానికి పోటీగా చంద్రబాబు మాత్రం నవ నిర్మాణ దీక్ష అని పోటీ కార్యక్రమం పెట్టి విభజన అన్యాయం అని మనం కోరుకోలేదని, ఆంధ్రులకు అవమానం జరిగిందని, ఏవేవో పిచ్చి ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. ఎటూ అందుబాటులో ఉద్యోగులు ఉంటారు కాబట్టి వారికి ఇష్టం ఉన్నా, లేకున్నా అందులో పాల్గొనక తప్పదు. ఏదో ఒక సంవత్సరం అయితే సరేలే అని సరిపెట్టుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు నడుపుతున్నారు. చంద్రబాబు అదికారంలో ఉన్నంతకాలం ఇలాగే అవమానం పేరుతో ఆంధ్రులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నట్లుగా ఉంది.. రాష్ట్ర విభజన జరగడం ఆంధ్ర, రాయలసీమలలో చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు.
కాని గత ముప్పై ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమైనా సమైక్య రాష్ట్రం కొనసాగాలని కోరిందా? ఒకటికి రెండుసార్లు లేఖ ఇచ్చిందే. తెలంగాణ టీడీపీ ఎంపీలు తెలంగాణ ఇవ్వాల్సిందేనని పార్లమెంటులో నినదిస్తే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సమైక్య రాష్ట్రం ఉండాల్సిందేనని గొడవ చేశారు కదా. ఇది తెలుగుదేశం పార్టీకి అవమానంగా అనిపించలేదా. ఒక పార్టీకి ఒక విదానం ఉంటుంది. రెండు విధానాలు మావే నంటూ తెలంగాణలో తెలుగుదేశం లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని, ఏపీలో విభజన మనం కోరుకోలేదని చెప్పడం తెలుగు ప్రజలను, ఆంధ్రులను అవమానించినట్లు కాదా? ఇవన్ని ఒక ఎత్తు అయితే అధికారంలోకి వచ్చాక సీమాంధ్రులకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్‌కు ఒక పుట్టిన రోజు అంటూ లేకుండా చేసే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారో తెలియదు.
ప్రజాస్వామ్యం ముసుగులో తిరుగులేని నియంతృత్వాన్ని అమలు చేస్తున్నందున తెలుగుదేశం నేతలు ఎవరూ నోరు మెదపకపపోవచ్చు. తెలుగు భాష, తెలుగు ఉత్సవాలు అంటూ తిరిగే మండలి బుద్ధ ప్రసాద్ వంటివారికి ప్రస్తుతం పదవులలో ఉన్నందున ఇందులో పెద్దగా తప్పు కనిపించకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం ఇప్పుడు ఆ పార్టీలో ఎవరికి లేదు. ఆనాడు మదరాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఎంత పోరాటం జరిగిందో ఒక్కసారి చరిత్ర చదివితే అర్థం అవుతుంది.
పొట్టి శ్రీరాములు ఏభైఎనిమిది రోజుల ఉపవాసదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఆంధ్ర అంతటా ఎంతటి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిందో ఆనాటి విషయాలు తెలుసుకుంటే అర్థం అవుతుంది. చివరికి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూనే దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అని ప్రకటించారన్న సంగతి మర్చిపోకూడదు. ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో మహనీయులు ఆనాడు రాజకీయాలకు ఒక వన్నె తెచ్చారు. వారంతా తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావాలని కాంక్షించి సాకారం చేశారు. మంచో, చెడో ఏభైఎనిమిదేళ్ల తర్వాత విభజన జరిగిపోయింది.
దానికి చంద్రబాబు నాయుడు అసలు కారణం కాదన్నట్లు మిగిలినవారే బాధ్యులన్నట్లు ప్రచారం చేసుకుంటే చేసుకోనివ్వండి. కాని ఆంధ్రులకు ఒక చరిత్ర ఉందని, రాష్ట్ర సాధనలో ఎందరో గొప్పవారి త్యాగాలు ఉన్నాయని తెలియచెప్పే నవంబర్ ఒకటిని మాత్రం విస్మరించి చరిత్రను మరుగున పరచుకోవాలనుకోవడం ఆంధ్రులకు జరుగుతున్న అసలైన అవమానం అనిపిస్తుంది. ముఖ్యమంత్రులుగా ఉన్నవారెవరూ తమ పేరుతో వివిధ పధకాలను అమలు చేసిన చరిత్ర ఇంతవరకు లేదు. అది చంద్రబాబుకే చెల్లింది.అయినా ఫర్వాలేదు. చరిత్రలో చంద్రబాబు ఒక్కడే కనిపించాలని అనుకుంటున్నట్లు ఉంటుంది.
ఆ తాపత్రయంలో తానేమీ చేస్తున్నది ఆయనకు తెలియడం లేదు. ఎవరు చెప్పేనా వినే పరిస్థితిలో కూడా ఆయన లేరన్న సంకేతాలు వస్తున్నాయి. ఎవరికో రాష్ట్రం ఇచ్చారని విలపించడం కాదు. ఇప్పుడు చేయవలసింది. ఏపీ రాష్ట్రం అందరిది.. అందరికి ఇది వెలుగులు పంచుతుందన్న విశ్వాసం ఇవ్వడం. నవంబర్ ఒకటా, లేక అక్టోబర్ ఒకటా. లేక మరొకటా. ఏదో ఒక తేదీని చరిత్రకు అనుసంధానంగా నిర్ణయించుకుని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకపోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంది.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్