మనకు మరో రజతం...సంబరాలు చేసుకోవచ్చా...!

మనకు అంటే ఇండియాకు మరో రజత పతకమా? అదేంటీ రియో ఒలింపిక్స్‌ ముగిసి చాలా రోజులైంది కదా. తెలుగమ్మాయి సింధుకు, సాక్షి మలిక్‌కు రజత, కాంస్య పతకాలు వచ్చాయి కదా. సింధు రజతం సాధించినందుకు దేశమంతా సంబరాలు చేసుకుంది కదా. తెలుగు ముఖ్యమంత్రులు పోటీలుపడి సింధుకు కానుకలు సమర్పించడం, ఘన సత్కారాలు చేయడం చూశాం కదా. ఇంతా అయ్యాక మళ్లీ రజతం ఏమిటి? నిజమే... ఇండియాకు మరో రజత పతకం వచ్చింది. ఇది దేశీయ క్రీడలకు సంబంధించిది కాదు. ఒలింపిక్స్‌కు సంబంధించిందే. 

ఒక్కోసారి చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. అలాంటివి జరిగినప్పుడు నవ్వాలో, ఏడవాలో అర్థంకాదు. సంబరాలు చేసుకోవాలో, గమ్మున ఉండిపోవాలో తెలియదు. ఇలాంటి పరిస్థితే వచ్చింది ఇప్పుడు. ఈ రజత పతకం 'అడ్డీమార్‌ గుడ్డీ దెబ్బ'గా వచ్చింది. అంటే లక్కీగా వచ్చిందని అర్థం. ఇది లండన్‌ ఒలింపిక్స్‌కు సంబంధించింది.  మొన్నటి రియో ఒలింపిక్స్‌లో ఇండియా రెజ్లర్‌ యోగేశ్వర దత్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే విఫలమయ్యాడు. నిరాశతో ఇంటికొచ్చిన అతనికి ఇప్పుడు 'రజత' వార్త తెలిసింది. అదీ 2012 లండన్‌ ఒలింపిక్స్‌కు సంబంధించింది. 

ఆ క్రీడల్లో (60 కేజీల ఫ్రీస్టయిల్‌) యోగేశ్వర్‌ కాంస్య పతకం సాధించాడు. రజత పతకం రష్యాకు చెందిన బెసిక్‌ కుడుఖోవ్‌కు (27) దక్కింది. ప్రస్తుతం అతను లోకంలో లేడు. 2013లో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. అయితే డోప్‌ టెస్టులో అతను నిషిద్ధ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలడంతో అతని రజత పతకాన్ని కాంస్య పతక విజేత అయిన యోగేశ్వర్‌కు ఇచ్చేశారు. దీనిపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. కుడుఖోవ్‌ నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాడు.  గొప్ప రెజ్లర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.  

విచిత్రమేమిటంటే ఈ రష్యా రెజ్లర్‌ తప్పు చేశాడని అతను చనిపోయాక అంటే రియో ఒలింపిక్స్‌కు ముందు తేలింది. రియోకు ముందు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ కుడుఖోవ్‌ సహా ఐదుగురు రెజ్లర్‌లకు  సంబంధించిన నమూనాలను మళ్లీ పరీక్షించింది. అతను 2013లోనే చనిపోయాడు కదా...! ఎలా పరీక్షించారని అనుకుంటున్నారా? అండన్‌ ఒలింపిక్స్‌ సమయంలో అధికారులు రష్యా క్రీడాకారుడి నమూనాలను సేకరించి భద్రపరిచారు. క్రీడాకారులకు సంబంధించిన శాంపిల్స్‌ ఇలా భద్రపరచడం ఆనవాయితీ. ఆధునిక టెక్నాలజీ ద్వారా ఈ శాంపిల్స్‌ను పదేళ్లపాటు భద్రపరుస్తారు. ఇలా దాచిన రష్యా క్రీడాకారుడి శాంపిల్స్‌ను ఐవోసీ అధికారులు రీటెస్ట్‌ చేసినప్పుడు అతను తప్పు చేశాడని తేలింది. 

యోగేశ్వర్‌ దత్‌ పతకం అప్‌డేట్‌ అవ్వడం అనుకోకుండా జరిగింది. రియోలో విఫలమైన అతనికి ఈ విధంగా విజయం లభించింది. దీన్ని యోగేశ్వర్‌ కూడా నమ్మలేకుండా ఉన్నాడు. మీడియా అతన్ని సంప్రదించినప్పుడు తానే మాట్లాడే స్థితిలో లేనని చెప్పాడు. లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకాలు సాధించిన మరో ఇద్దరు భారతీయుల సరసన యోగేశ్వర్‌ చేరాడు. క్రీడా ప్రపంచంలో ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటాయి. కాని ఇదీ మరీ విచిత్రంగా ఉంది. రజతం సాధించిన రష్యా క్రీడాకారుడు చనిపోయిన మూడేళ్ల తరువాత దోషిగా తేలాడు. 

యోగేశ్వర్‌కు ఇప్పుడు రజతం ప్రకటించినందుకు సంబరపడాల్సిందేమీలేదు. ప్రతిభతో గెలుచుకున్నది కాదు. ఒక క్రీడాకారుడు తప్పు చేసినందువల్ల వచ్చింది. అందులోనూ నాలుగేళ్ల తరువాత ఈ ఘటన జరిగింది. అసలు రియోకు ముందు రీటెస్ట్‌ చేసి రష్యా క్రీడాకారుడు తప్పు చేశాడని నిర్ధారించుకున్న అధికారులు యోగేశ్వర్‌కు పతకాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ఇంత ఆలస్యంగా ఎందుకు ప్రకటించారో తెలియదు. రియో ముగిసి చాలా రోజులైంది. ఏది ఏమైనా యోగేశ్వర్‌ విషయంలో చిత్రం...విచిత్రం జరిగింది. 

Show comments