మీకోదండం 'బాబో'య్‌.!

మొన్న మాజీ చీఫ్‌ సెక్రెటరీ, ఇప్పుడు 'మెట్రో' పితామహుడు.. చంద్రబాబు దెబ్బకి 'పారిపోతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఎందుకిలా.? 'ప్రపంచంలోనే ది గ్రేట్‌ అడ్మినిస్ట్రేటర్‌' అంటూ చంద్రబాబు తనకు తానే కితాబులిచ్చేసుకుంటారు. కానీ, చంద్రబాబు అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపబిలిటీస్‌ చూసి చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసిన వ్యక్తే ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. 

మాజీ చీఫ్‌ సెక్రెటరీ ఐవీఆర్‌ కృష్ణారావుని చంద్రబాబు ఏ స్థాయిలో అవమానించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా, ఈసారి 'మెట్రో' శ్రీధరన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 'దండం' పెట్టి వెళ్ళిపోయారు. హైద్రాబాద్‌లో మెట్రో రైలుకి ధీటుగా విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ని షురూ చేసింది చంద్రబాబు సర్కార్‌. దానికి మెట్రో శ్రీధరన్‌ని సలహాదారుగా నియమించింది.

కానీ, మెట్రో - విజయవాడకు వర్కవుట్‌ కాదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. ఈ విషయమై చంద్రబాబుకీ - మెట్రో శ్రీధరన్‌కీ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అధికారం చంద్రబాబు చేతుల్లో వుంది గనుక, అంతా ఆయనిష్టం. అలాంటి వ్యక్తి కనుసన్నల్లో పనిచేయడం 'మెట్రో' శ్రీధరన్‌కి ఇంకా కష్టం. అలా ఈ బంధం తెగిపోయింది. 

గతంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితోనూ చంద్రబాబుకి ఇవే తరహా ఇబ్బందులొచ్చాయి. పదవీ విరమణ అనంతరం, టీడీపీలో చేరిన ఆ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆ తర్వాత టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు. చెప్పుకుంటూ పోతే, 'అధికారులు' చంద్రబాబు విషయంలో బెంబేలెత్తడం, అసహనం వ్యక్తం చేయడం కొత్త విషయమేమీ కాదు. 

ఎందుకిలా.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.! 'నేను నిప్పు.. నేనే నిప్పు..' అని చెప్పుకునే చంద్రబాబు, ఎవర్నీ నమ్మరు.. పదవులు కట్టబెడ్తారుగానీ, ఆ పదవులకి గౌరవం ఇవ్వరు. అక్కడే వస్తోంది తేడా అంతా. రాజధాని నిర్మాణానికి సంబంధించి 'మకీ' సంస్థని ఆకాశానికెత్తేసి, ఆ సంస్థని ఎలా అవమానించారో చూశాం. సింగపూర్‌ విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం నడిచింది. ఆయనే గౌరవిస్తారు, ఆయనే అవమానిస్తారు. 

'గౌరవించకపోయినా ఫర్వాలేదు, మా బాధ్యతలు మమ్మల్ని నిర్వర్తించేలా సహకరిస్తే చాలు.. అవమానాలెదురైతే ఎలా పనిచేయగలం.?' అంటారు చంద్రబాబుకి 'దండం' పెట్టేసే అధికారులు. అదండీ అసలు విషయం.

Show comments