'ఉత్సవ్‌' రగడ: టీడీపీ ఆధిపత్య పోరు

'విశాఖ ఉత్సవ్‌' సంగతేమే కానీ జిల్లాలోని టీడీపీ ఆధిపత్య పోరును మరోమారు బజారున పడేసింది. నగరానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఒంటి చేతుల మీద ఈ ఉత్సవాలను నిర్వహించడంతో ఆగ్రహించిన సీనియర్‌ మంత్రి సిహెచ్‌ అయ్యన్నపాత్రుడు ఏకంగా ఉత్సవాలనే బహిష్కరించారు. స్ధానిక కళాకారులకు అన్యాయం జరిగిందన్న సాకుతో ఆయన మూడు రోజుల సంబరానికి దూరంగా ఉండిపోయారు.  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ సహా, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావుల, పల్లె రఘునాధరావు, కామినేని శ్రీనివాసరావు, పల్లె రఘునాధరెడ్డి వంటి వారు ఉత్సవాలకు హాజరైనా జిల్లా మంత్రి మాత్రం రాకపోవడం టీడీపీ ముఠా రాజకీయాలను పార్టీ యావత్తు చూసేలా చేసింది. 

నాలుగైదు కోట్లతో చేసిన విశాఖ ఉత్సవ్‌ ఓ దండుగమారి వ్యవహారమని అయ్యన్న ఘాటుగా విమర్శలు చేశారు కూడా. ఉత్సవాల పేరుతో దందా చేశారని, దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, గంటా మాత్రం ఉత్సవాలకు అంతా హాజరయ్యారని, ఇది ప్రభుత్వ కార్యక్రమమని, అయ్యన్న రాకపోవడానికి కారణాలు ఆయననే అడగాలంటూ మీడియాకు గడుసైన జవాబు ఇచ్చి ఊరుకున్నారు. అయ్యన్నతో పాటు, ఆయన వర్గీయునిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో టీడీపీలోకి ఓ వర్గం మాత్రమే పెత్తనం చేసిందన్న మాట వినిపించింది. ఇక, ఉత్సవాలలో గంటా బృందం చేసిన దందా అంతా ఇంతా కాదన్న విమర్శలు ఉన్నాయి. ఆర్‌కె బీచ్‌ మొత్తం స్టాల్స్‌ను బేరానికి పెట్టేసి దొరికిన వారికి దొరికినంతగా దోచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇక, టీడీపీ మంత్రిగా ఉన్న గంటా ఆయన అనుచరులు, ఆ పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను, కానీ, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే బాలయ్య సినిమాలను కానీ ప్రస్తావించకుండా కేవలం మెగాస్టార్‌ కుటుంబం జపం చేయడం, ఆ కుటుంబం నటించిన చిత్రాలలోని పాటలనే పాడించి డ్యాన్సులు చేయించడం ద్వారా తన ప్రజారాజ్యం పాత వాసనలను బాగా బయట పెట్టుకున్నారని అంటున్నారు. జిల్లా కలెక్టర్‌ సైతం మూడు రోజుల పాటు ఏ ఇతర కార్యక్రమాలూ పెట్టుకోకుండా ఉత్సవ్‌కే ప్రాధాన్యత ఇస్తూ మంత్రి గంటా కనుసన్నలలోనే పనిచేసుకుపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పైగా, కలెక్టర్‌ ఈల పాటలు పాడి మరీ తనలోని కళా తృష్ణను తీర్చుకోవడం విశాఖ ఉత్సవ్‌లో మరో విశేషం. మొత్తం మీద చూసుకుంటే విశాఖ ఉత్సవ్‌ పేరుతో గంటా తన ఆధిపత్యాన్ని మరో మారు ప్రదర్శించేందుకు వినియోగించుకోగా, బహిష్కరణ అస్త్రంతో మరో మంత్రి ఉత్సవ్‌ గాలి తీసేశారు. రాజకీయ ఉత్సవ్‌గా దీనిని విపక్షాలు అభివర్ణిస్తూ స్మార్ట్‌ సిటీని జాతర పల్లెగా మార్చేశారని సెటైర్లు వేశాయి.

Show comments