చంద్రబాబూ.. అసెంబ్లీకైనా రానిస్తారా.?

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాని ఆహ్వానించి అడ్డుకుంది ఆంద్రప్రదేశ్‌ ప్రభ్వుత్వం. అక్కడికేదో అది ప్రైవేటు కార్యక్రమం అన్నట్లుగా కోడలు బ్రాహ్మణికి పెద్ద పీట వేసి, ప్రతిపక్షాన్ని అవమానపర్చడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. హెరిటేజ్‌ సంస్థ తరఫున ఎంటర్‌ప్రెన్యూర్‌గా బ్రాహ్మణికి అవకాశం కల్పించాలనుకోవడం సబబే కావొచ్చు. అలాగైతే, వైఎస్‌ జగన్‌ సతీమణిని కూడా ఆహ్వానించి వుండాలి కదా.! 

ఇక్కడ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఇన్‌టెన్షన్‌ క్లియర్‌గా అర్థమవుతోంది. ఆంద్రప్రదేశ్‌ అన్నది తమ జాగీర్‌.. అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోంది. అయినా, ప్రతిపక్షం విషయంలో టీడీపీ ఇలా వ్యవహరించడం ఇదే కొత్త కాదు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వైఎస్‌ జగన్‌ ఎందుకు హాజరు కాలేదో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఒకవేళ ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి, వైఎస్‌ జగన్‌ అక్కడికి వెళ్ళినా, రోజా తరహాలోనే వైఎస్‌ జగన్‌ అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చేదే.! 

ఇప్పటిదాకా జరిగిన వ్యవహారాలు వేరు.. ఇకపై జరగాల్సిన వ్యవహారాలు వేరు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. చంద్రబాబు సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కొత్త అసెంబ్లీలో ఈ సమావేశాలు జరుగుతాయి. మరి, ఈ అసెంబ్లీ సమావేశాలకైనా ప్రతిపక్షాన్ని రానిస్తారా.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

'అసెంబ్లీలో గలాటా చేసే అవకాశాలున్నాయి.. ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి..' అంటూ డీజీపీ మీడియా ముందుకొచ్చి, ప్రతిపక్షాన్ని అసలు వెలగపూడికే రానివ్వకపోతే ఏంటి పరిస్థితి.? ఇలాంటి విషయాల్లో టీడీపీ ప్రదర్శిస్తోన్న 'అతి' కన్నా, పోలీస్‌ బాస్‌ 'అతి' ఎక్కువైపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనేం చేస్తారు పాపం.. ముఖ్యమంత్రి ఆదేశాల్ని ఆయన పాటిస్తారంతే. అయితే, ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆయన ఇంకొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తారంతే. Readmore!

Show comments