వెంకయ్యా.. మీ 'నాయుడి' సంంగతేంటి.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచే వచ్చిన పార్టీ అంటూ ఒకింత ఎగతాళిగా మాట్లాడేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అవునా.? అలాగైతే, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎవరి చేతిల్లో వుంది.? ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, రాజకీయ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమయ్యింది.? మిత్రుడి గురించీ, మిత్రపక్షం గురించీ వెంకయ్యనాయుడు ఇంకాస్త క్లారిటీ ఇస్తే బావుంటుందేమో.! 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతోందన్నది వెంకయ్యగారి ఉవాచ. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడం నాన్సెన్స్‌ అట. వైఎస్సార్సీపీ సైతం ప్రత్యేక హోదా పేరుతో ఆందోళనలు చేయడం వల్ల ఉపయోగం లేదని వెంకయ్యనాయుడు సెలవిచ్చారు. అంతే మరి, ఏరు దాటేశాక తెప్ప తగలెయ్యడమెలాగో వెంకయ్యనాయుడుగారిని చూసే తెలుసుకోవాలి. 

పదవి వచ్చాక ఒకలా, పదవి రాకముందు ఇంకొకలా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వెంకయ్యనాయుడు కూడా నీతులు చెప్పేస్తే ఎలా.? కాంగ్రెస్‌, విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేసిందని వెంకయ్య గత ఎన్నికల్లో చెప్పారు. ప్రధాని అవకముందు నరేంద్రమోడీ కూడా ఇదే సెలవిచ్చారు. మరి, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ అన్యాయాన్ని ఎందుకు సరిదిద్దిలేదట.? ప్రత్యేక హోదా అంశం చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని చెబుతున్నప్పుడు, ఆ చట్టంలో పెట్టడం అనే ప్రక్రియ, పూర్తి మెజార్టీ వున్న బీజేపీ చేసెయ్యొచ్చు కదా.! 

ప్రతిపక్షం అన్నాక, అధికారంలో వున్నవారిని ప్రశ్నించడం సహజమే. అదే చేస్తోంది వైఎస్సార్సీపీ. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తామని చెప్పినప్పుడేమో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని వెంకయ్యనాయుడు చెబుతారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మాత్రం, ప్రతిపక్షానికి ఆ హక్కు లేదంటారు.. పైగా, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ.. అని ఎగతాళి చేస్తారు. ఇదేం రాజకీయం వెంకయ్యగారు.? 

Readmore!

సరే, జగన్‌ ఒకప్పుడు కాంగ్రెస్‌ ఎంపీ.. ఆయన కాంగ్రెస్‌కి గుడ్‌ బై చెప్పి, వైఎస్సార్సీపీని స్థాపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షం. ఇప్పటికీ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన పార్టీ అయినప్పుడు, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన చంద్రబాబు, టీడీపీ అధినేతగా వుంటోంటే.. ఆ కాంగ్రెస్‌ మూలాల్ని పట్టుకుని వెంకయ్య, చంద్రబాబునెందుకు ప్రశ్నించరట.? రాజకీయాల్లో బొంకడం అన్న మాటకి వెంకయ్యనాయుడిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసెయ్యొచ్చేమో.!

Show comments