మోడీ చెలగాటం.. చంద్రులకి ప్రాణ సంకటం.!

ఓటుకు నోటు కేసు.. దేశాన్ని కుదిపేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కేసులో అడ్డంగా బుక్కయిపోయారనుకున్నారంతా. బ్రహ్మదేవుడు దిగొచ్చినా చంద్రబాబుని కాపాడలేడంటూ తెలంగాణ ముఖ్యమంత్రి 'తొడకొట్టేశారు'. 'బస్తీమే సవాల్‌.. నాతో పెట్టుకున్నావో, నీ ప్రభుత్వం కూలిపోతుంది..' అంటూ చంద్రబాబు మీసం మెలేశారు. 

చంద్రబాబుని కేసీఆర్‌, ఓటుకు నోటు కేసుతో భయపెడితే, కేసీఆర్‌ని చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో భయపెట్టారు. ఇద్దరికీ మధ్య రాజీ కుదిర్చింది మాత్రం ప్రధాన మంత్రి నరేంద్రమోడీనే. అమరావతి వేదికగా చంద్రబాబు, కేసీఆర్‌ చేతులు కలపడం వెనుక, నరేంద్రమోడీ చేసిన 'కృషి' అంతా ఇంతా కాదు. చిత్రంగా ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వివాదాలు వస్తున్నా, హైకోర్టు విభజన వివాదం ముదిరినా నరేంద్రమోడీ కల్పించుకోలేదు. రాజకీయ వివాదాల విషయంలో మాత్రం, వెంకయ్యనాయుడిని పురమాయించి, వివాదం సద్దుమణిగేలా చేయగలిగారు ప్రధాని నరేంద్రమోడీ. 

ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకో వివాదం ముదిరి పాకాన పడ్తోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈవోబీడీ) వివాదం పేరు చెప్పి, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పరస్పరం సవాళ్ళు విసురుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ కేసులు పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు కేసులపై తుది నిర్ణయం తీసుకోనుంది. 'కాపీ కొట్టారు' అంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలంగాణ సర్కార్‌ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే, డైరెక్ట్‌గా ఏపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయలేదు తెలంగాణ.. ఇక్కడే తెలంగాణ వ్యూహం సుస్పష్టమవుతోంది. మరోపక్క, తమ సర్వర్‌ నుంచి కేంద్రానికి వెళ్ళిన రహస్య సమాచారాన్ని తెలంగాణ ఎలా 'హ్యాక్‌' చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రశ్నిస్తోంది. హ్యాకింగ్‌ కూడా సైబర్‌ క్రైమ్‌ కిందకే వస్తుంది. 

చిత్రమైన విషయమేంటంటే, కేంద్రానికి వెళ్ళిన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రం ఎలా సేకరించగలిగింది.? దాన్ని విశ్లేషించి ఎలా ఫిర్యాదు చేయగలిగింది.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒకటీ, కేంద్రం నుంచి ఈ సమాచారం లీక్‌ అయి వుండాలి. 'లీక్‌' అవడమే నిజమైతే, ఎవరో ఒక అధికారిని బుక్‌ చేసేయడం ఖాయమనుకోండి.. అది వేరే విషయం. 

కానీ, జరుగుతున్న పరిణామాల్ని పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్ని తన కనుసన్నల్లో నడపాలనుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ, వ్యూహాత్మకంగా ఈ వివాదాల్ని సృష్టించడమో, లేదంటే వున్న వివాదాల్ని పెంచి పోషించడమో చేస్తున్నారనే అనుమానం కలగకమానదు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో చంద్రబాబు పెదవి విప్పలేకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసు. కేంద్రానికి హైకోర్టు విషయంలో అయినా, ఇంకే విషయంలో అయినా కేసీఆర్‌ అల్టిమేటం ఇవ్వలేకపోవడానికి కారణం ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం. ఈ రెండూ లేకపోతే ఇద్దరు చంద్రుల్నీ పట్టుకోవడం కష్టమే. 

తెలంగాణకి 'ఈవోడీబీ' సమాచారం ఇవ్వడం ద్వారా, చంద్రబాబుని లాక్‌ చేయించి, ఆ తర్వాత హ్యాకింగ్‌ పేరుతో కేసీఆర్‌ని లాక్‌ చేయించి.. రెండు వైపుల నుంచీ బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నట్లే కన్పిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, హైకోర్టు విభజన వివాదంలో కేంద్రం తప్పక జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే నరేంద్రమోడీ ఈ సరికొత్త వ్యూహాన్ని రచించారా.? ఆయన ఇరు రాష్ట్రాల మధ్యా చిచ్చుపెడుతున్నారా.? ఈ అనుమానాలిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గట్టిగా విన్పిస్తున్నాయి. 

Show comments