మోడీ ఛీ కొట్టినా ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవాలని ఏ మాత్రం లేదు. ఇందుకు పలు రాజకీయ కారణాలున్నాయి.  కేంద్రంలో బీజేపీికి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ బలపడే అవకాశాలు ఏమాత్రం కనపడడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు బాగా దెబ్బతిన్నాయి. ఒక్క కేరళ మాత్రమే  ఆ పార్టీకి మిగిలింది. వామపక్షాలు మాత్రమే జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ఎంతో కొంత సన్నిహితంగా ఉన్నాయి. జనతాదళ్ (యు) బీహార్ దాటి వెళ్లలేని పరిస్థితి ఉన్నది. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రోజురోజుకూ బలహీన పడుతున్నారు. జాతీయ స్థాయిలో ఒకప్పుడు ప్రత్యామ్నాయ పాత్ర నిర్వహించిన పార్టీలేవీ పెద్దగా బలంగా లేవు. కాంగ్రెస్ బలపడి, మిగతా పార్టీలన్నీ ఎంతో కొంత కోలుకుని బీజేపీికి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమిని నిర్వహించినప్పుడే మళ్లీ యునెటెడ్ ఫ్రంట్ రోజులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడే చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పగలుగుతాడు. ఆ రోజులు ఇక వచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేదు. 

రెండవది, ఢిల్లీ మద్దతు లేకపోతే ఏ రాష్ర్ట పార్టీ మనుగడ సాధించలేదు. చంద్రబాబు ఒక రాజకీయ అవసరం కోసం బీజేపీతో చేతులు కలిపాడు. మోడీ సర్కార్‌కు కేంద్రంలో చంద్రబాబుతో పనిలేదు. చంద్రబాబు మద్దతునిచ్చినా, ఇవ్వకపోయినా మోడీకి పెద్ద తేడా రాదు. కనుక మోడీ సహాయం కావాలంటే చంద్రబాబు నాయుడే ఆయన అడుగులకు మడుగులొత్తాల్సి ఉంటుంది. కేంద్రం ఎంతసహాయం ఇస్తే అంత సహాయం చంద్రబాబు తీసుకోవాల్సిందే కాని డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు. చంద్రబాబు ఎప్పుడుకోరితే అప్పుడు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు మోడీ సిద్దంగా లేరు. మోడీ దయాదాక్షిణ్యాలపైనే చంద్రబాబు ఆధారపడాలి. ఎందుకంటే ఏపీలో కొత్త రాజధాని నిర్మాణానికి తగిన నిధులు చంద్రబాబు వద్దలేవు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలన్నీ నెరవేర్చాలంటే మోడీ సహకారం అవసరం. వాటిని నెరవేర్చేందుకు ఒక గడువు అంటూ ఏమీ చట్టంలో పేర్కొనలేదు. అందువల్ల సాధ్యమైనంత త్వరలో చట్టంలో పేర్కొన్న సంస్థలకు ఆమోదముద్ర, వాటికి నిధుల మంజూరీ చేయాలంటే మోడీకి సలామ్ కొట్టాలి. రెవిన్యూ లోటు భర్తీ, రాజధానికి నిర్మాణానికి సహాయంతో పాటు ప్రత్యేక పారిశ్రామిక కారిడార్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రెలు, ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు మొదలెనవన్నీ ఏపీలో నెలకొనాలంటే మోడీ సహాయం అవసరం.బీజేపీకి మిత్రపక్షంగా ఉండి స్నేహ పూరితంగా  వ్యవహరిస్తేనే మోడీ సానుకూలంగా మారతారు. లేకపోతే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా చంద్రబాబుకు దొరకదు. 

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసు. అందుకే ఇంతకాలం మౌనంగా ఉన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేవని కేంద్రం ఎప్పుడో చెప్పింది. 14వ ఆర్థిక సంఘం ఆమేరకు నివేదిక కూడా సమర్పించింది. ప్రత్యేక హోదా రాదని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు. అన్ని సమస్యలకూ అది నివారణ ఔషధం కాదని కూడా చెప్పేశారు. కాని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు, వెసీపీ పుణ్యమా అని అది ఇప్పుడొక రాజకీయ అస్త్రంగా మారింది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు మళ్లీ ఆ అంశానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది. రాష్ర్టంలో కాంగ్రెస్‌కు ఊపిరిపోసింది. జగన్‌కు, వామపక్ష పార్టీలకు అది ఒక అంశంగా మారింది. అన్ని పార్టీలూ తెలుగుదేశంకు వ్యతిరేకంగా జతకట్టాయి. ఏపీలో ప్రత్యేక హోదా ఒక ఉద్యమంగా రూపుదాల్చుకునే అవకాశం ఏర్పడింది. 

దీనితో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకుంటే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. అదే సమయంలో ఆయన ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయకుండా ఉండలేని పరిస్థితిలో పడ్డారు. నిరసన తెలపాల్సిందిగా తెలుగుదేశం ఎంపీలను పురికొల్పారు. వారు కేవీపీ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు చెప్పక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో అరుణ్ జెట్లీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసినా తెలుగుదేశం ఎంపీలు కిమ్మనకుండా ఉండిపోయారు. అదే కాంగ్రెస్ వాకౌట్ చేసింది. లోక్‌సభలో వెసీపీ ఎంపీలు నిరసన తెలుపుతుంటే తెలుగుదేశం ఎంపీలు మౌన ప్రేక్షకులుగా మారారు. కాకపోతే గాంధీ విగ్రహం వద్ద ధర్నాచేశారు. తెలుగుదేశం ఎంపీ శివ ప్రసాద్ ఎప్పటిలాగా వేషాలు వేషారు. అరుణ్ జెట్లీ ప్రకటనను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. 

ఇదంతా డ్రామా అని చంద్రబాబు వర్గీయులకు తెలుసు. కాని ఈ డ్రామాయే నరేంద్రమోడీకి చంద్రబాబుపై కోపం తెప్పించింది. చంద్రబాబు తమతో ఉంటే ఉండాలని, లేకపోతే  పోవాలని ఆయన గట్టిగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం గతంలో పోరాడిన వెంకయ్యనాయుడుకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఆయన ప్రధానిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. దీనితో చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వచ్చి తన రాజకీయ సమస్యలేమిటో  ప్రధానమంత్రి మోడీకి, ఇతర కేంద్రమంత్రులకు చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటే మోడీ తమకు అనుకూలంగా మారతారని చంద్రబాబు ఆశిస్తున్నారు. కాని మోడీకి మాత్రం చంద్రబాబు ప్లాన్‌లతో సంబంధం లేదు.  చంద్రబాబు లేకపోతే తనకు కేసీఆర్ ఉన్నాడని ఆయన భావిస్తున్నారు. ఇద్దరి మధ్యా విభజించి పాలించు సూత్రాన్ని ఆయన పాటిస్తున్నారు. మోడీ ఛీకొట్టినా ఇప్పట్లో చంద్రబాబు చేసేది ఏమీలేదు.  

Show comments