ఓటుకు నోటు వ్యవహారంలో తనను జాతీయ మీడియా ప్రశ్నించినప్పుడు.. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ఒకే ప్రశ్నను వేశాడు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు... మీడియానే ఎదురు ప్రశ్నించాడు. మీరు ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించారా? ఆ వాయిస్ మీదేనా కాదా? అని మీడియా అడిగితే, చంద్రబాబు మాత్రం... అసలు తెలంగాణలో అసెంబ్లీలో బలాబలాలను బట్టి తెరాస అదనపు అభ్యర్థిని ఎలా నిలుపుతుంది? వాళ్లకు ఆ సీటు దక్కే అవకాశం లేకపోయినా.. ఎలా కంటెస్ట్ చేస్తుంది? అనే ప్రశ్నను బాబు ఒకటికి వందసార్లు వేశారు.
మీరు స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెడుతూ ఫోన్ చేశారా? అని అడిగినా... తెరాస ఎలా పోటీ చేస్తుంది? అనే ప్రశ్ననే వేశారు టీడీపీ అధినేత. మరి అభినవ ప్రజాస్వామ్య వాది అయిన చంద్రబాబు వెర్షన్ ప్రకారం... తమకు బలంలేని చోట క్యాండిడేట్ ను నిలపడం అంటే... అంతకు మించిన అప్రజాస్వామిక చర్య మరోటి ఉండదు. తెలంగాణ అసెంబ్లీలో బలాబలాలను బట్టి తమది కాని సీటుకు టీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడం పాపం. ఆ విషయంలో తెరాస తీరును బాబుగారు ఖండించారు.
మరి కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. మరి తెలంగాణ సుద్దులు చెప్పిన అదే చంద్రబాబు నాయుడు.. ఏకంగా మూడు జిల్లాల్లో తమకు బలంలేకపోయినా.. అభ్యర్థులను నిలిపారు. నెల్లూరు, కర్నూలు, కడప.. ఈ మూడు జిల్లాల స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీలో ఉంది. భారీ ఎత్తున క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలప్పటి బలాబలాలను బట్టి చూసుకుంటే... ఈ మూడు జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఆ ఓట్ల సంఖ్యను బట్టి చూస్తే.. ఇక్కడ పోటీనే అవసరం లేదు. అయితే.. నీతుల చంద్రబాబునాయుడు గారు మాత్రం ఈ మూడు జిల్లాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి.. గెలిచి తీరాల్సిందే అని తన మంత్రులకు, జిల్లాల నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదీ కథ.
తెలంగాణ అసెంబ్లీలో తగినంత బలంలేకపోయినా అదనపు అభ్యర్థిని నిలిపిన తెరాసది మాత్రం వ్యభిచారం. ఏపీలో అప్రజాస్వామికంగా ఏకంగా మూడు చోట్ల అభ్యర్థులను పెట్టిన తెలుగుదేశానిది మాత్రం సంసారం... ఇదీ చంద్రన్న బ్రీఫుడు భాష్యం.