రాలిన ఆకులు, అతక్కుంటాయా?

ఆకులు రాలితే, మళ్ళీ అతుక్కోవు. కొత్త ఆకులు రావాల్సిందే. ఇది 'చెట్టు శాస్త్రం'. రాజకీయాల్లోనూ ఓ చెట్టుంది, ఆ చెట్టుకి రెండాకులున్నాయి. దురదృష్టవశాత్తూ చెట్టు చనిపోయింది, ఆకులు మాత్రం మిగిలాయి. ఆ ఆకులూ రెపరెపలాడుతున్నాయి, ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో ఇంకా కొసప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. అదే అన్నాడీఎంకే పార్టీ. జయ లలిత మరణంతో నిజానికి అన్నాడీఎంకే పార్టీ చచ్చిపోయింది. ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ గాయబ్‌ అయితే, ఆ పేరు చెప్పి కొత్తగా రెండు పార్టీలు (శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు) తెరపైకొచ్చాయి. శశికళ వర్గం డబ్బుతో రాజకీయాల్ని శాసించేద్దామనుకుని బొక్కబోర్లా పడింది. ఇక గొడవలవల్ల లాభం లేదనుకుని, రెండాకులూ రాజీ సూత్రాన్ని అమలు చేస్తున్నాయి. 
కానీ, రాలిపోయిన ఆకులు చెట్టుకి అతుక్కునేదెలా.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అటు శశికళకిగానీ, ఇటు పన్నీర్‌ సెల్వంకిగానీ, ఇంకోపక్క ముఖ్యమంత్రి పళనిస్వామికిగానీ పార్టీని నడిపించే సత్తా అయితే లేదు. 

జయలలిత లెగసీ కారణంగానే అప్పటికప్పుడు వచ్చిన ఇమేజ్‌తో శశికళ విర్రవీగారు. ఇప్పుడామె జస్ట్‌ జీరో. జైల్లో జీవితం వెల్లదీయాల్సి వస్తోందామెకి. సీన్‌లో వున్నది పళనిస్వామి, పన్నీర్‌సెల్వం. ఇద్దరూ మాస్‌లీడర్లు కాదాయె. దాంతో ఇద్దరూ కలిసినా భవిష్యత్తులో అన్నాడీఎంకే పార్టీ పూర్వ వైభవాన్ని దక్కించుకునే అవకాశమే లేదు. జయలలిత లాంటి లీడర్‌, అన్నాడీఎంకే పార్టీలో లేకపోవడమే ఈ సమస్యకి కారణం. భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైందనీ, ముందు ముందు అన్నాడీఎంకే పార్టీ అంతర్థానమైపోతుందనీ పార్టీలో పరిణామాలపై జయలలిత సన్నిహితులు, సానుభూతిపరులు వాపోతున్నారు.

Show comments