'ఫిదా' - ఇది చిన్న సినిమాల్లో 'బాహుబలి'

'ఫిదా' సినిమా ప్రారంభమైనప్పుడు పెద్దగా అంచనాల్లేవు. సినిమా నిర్మాణం ఆలస్యమైనప్పుడు అంతా ఈ సినిమాని లైట్‌ తీసుకున్నారు. సినిమా విడుదలకు ముందు నెమ్మది నెమ్మదిగా హైప్‌ షురూ అయ్యింది. సినిమా విడుదలయ్యాక పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, 'సెన్సేషనల్‌ హిట్‌' అనే స్థాయిలో ఎవరూ ఈ సినిమాని అంచనా వేయలేదు. అంచనాల్ని మించిన విజయాన్ని అందుకున్నాక, 'వావ్‌ ఫిదా..' అంటున్నారిప్పుడంతా. 

మేకింగ్‌ దగ్గర్నుంచి, ప్రమోషన్‌ దాకా 'ఫిదా' విషయంలో ఎక్కడా నిర్మాత దిల్‌ రాజు రాజీపడలేదు. కథ, కథనాల విషయంలో శేఖర్‌ కమ్ముల మునుపటి 'ప్రత్యేకతను' చాటుకున్నాడు. హీరోయిజం జోలికి హీరో వరుణ్‌తేజ వెళ్ళలేదు. 'తెలంగాణ అమ్మాయి'గా భానుమతి పాత్రలో మలయాళీ బ్యూటీ సాయిపల్లవి ఒదిగిపోయింది.. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకుంది. అన్నీ కలిసొచ్చేశాయ్‌. అందుకే ఇంతటి అద్భుత విజయం. 

మొన్నామధ్య 'బాహుబలి' సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమా వసూళ్ళ గురించి తెలుగునాట ఎలా మాట్లాడుకున్నామో, ఆ స్థాయిలోనే 'ఫిదా' గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. అవును, 'ఫిదా' చిన్న సినిమాల్లో పెద్ద 'బాహుబలి'. 35 కోట్ల రూపాయల పైబడి షేర్‌ వసూలు చేయడం, ఓవర్‌సీస్‌లో వసూళ్ళ జాతర, నైజాంలో సంచలన విజయం.. ఈ సినిమా గొప్పతనానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

Show comments