ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పూర్తిగా రెడ్లనే నమ్ముకుంది తెలుగుదేశం పార్టీ. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలోజరిగే ఎమ్మెల్సీ ఎన్నిక.. ఈ మూడు సీట్లకూ తెలుగుదేశం వైపు నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే రంగంలోకి దిగుతుండటం విశేషం.
అనంతపురం-కడప- కర్నూలు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి కేజే రెడ్డిని, చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి పట్టాభిరెడ్డిని, కడప జిల్లా స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో ఎం. రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని బరిలోకి దించింది టీడీపీ.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు రకాల వ్యూహాలను ఫాలో అవుతూ ఈ అభ్యర్థులను రంగంలోకి దించింది. అందులో మొదటి అభ్యర్థులకు ఉన్న ధనబలం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల ఓట్లు భారీ ధరనే పలుకుతున్నాయి. వాటిని కొనగల సత్తా ఉన్న వాళ్లే వీళ్లు. తమకు టికెట్ ఇస్తే ఎన్ని కోట్ల ఖర్చు పెడతామో కూడా ఈ నేతలు ఓపెన్ ఆఫర్లు ఇచ్చారనే ప్రచారం ఉంది.
ఇక ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఇదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించింది. ఆ ఓట్లను చీల్చడానికి అదే సామాజికవర్గం నేతలైతే బాగుంటుందనేది టీడీపీ లెక్క. ఇది వరకూ ప్రకాశం స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోఇదే వ్యూహాన్ని ఫాలో అయ్యి.. అక్కడ తమకు బలం లేకున్నా విజయం సాధించగలిగింది టీడీపీ. దీంతో ఇప్పుడూ అలాగే ముందుకుపోతోంది! ఈ సారి ఎలాంటి ఫలితాలు ఉంటాయో!