ఏం కామెడీలయ్యా బాబూ.!

'మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం.. పార్టీ సమావేశంలో ముఖ్య నేతలపై గుస్సా అయిన చంద్రబాబు.. పార్టీకి మచ్చ తెచ్చే పనులు చేస్తే సహించబోనన్న చంద్రాబు..' 

- ఇదంతా ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కాస్త గట్టిగానే విన్పిస్తోన్న మీడియా కథనాల సారాంశం. 

ఫలానా మంత్రి మీద చంద్రబాబుకి కోపమొచ్చింది.. ఫలానా ఎమ్మెల్యేకి చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నారు.. ఫలానా నేతపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంటూ వార్తలు రావడమంటే.. ఏమో, చంద్రబాబు నిజంగానే 'అసహనం' వెల్లగక్కుతుండొచ్చుగాక అన్న అనుమానం కలుగుతుందెవరికైనా. కానీ, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న భయం పార్టీ నేతల్లో వుందా.? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. భయమెలా వుంటుంది, చర్యలు తీసుకోనప్పుడు. అధికార నేతల అరాచకాలు సుస్పష్టం. కానీ, ఉత్తుత్తి ఆగ్రహం తప్ప, ఆయా నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకున్న దాఖలాలేమన్నా వున్నాయా.? అంటే, లేవని చెప్పక తప్పదు. ఎందుకు.? అన్న ప్రశ్నకు సమాధానం సింపుల్‌.. చంద్రబాబుకి అంత సీన్‌ లేదు గనక.. అని. 

ఓ ఉదంతంలో.. ఓ ఎమ్మెల్యే, మహిళా తహసీల్దారుపై చెయ్యి చేసుకుంటే.. చంద్రబాబు, ఆ ఎపిసోడ్‌లో ఎమ్మెల్యేకి బాసటగా నిలిచారు. ఇంకో ఉదంతంలో, ఓ మహిళా ప్రజా ప్రతినిథి - మంత్రి కారణంగా తన కుటుంబానికి 'థ్రెట్‌' వుందని కన్నీరుమున్నీరైతే, చాలా తేలిగ్గా చంద్రబాబు ఆ వివాదాన్ని కామప్‌ చేసేశారు. సాక్షాత్తూ కోడెల శివప్రసాద్‌, ఎన్నికల్లో చేసిన ఖర్చు విషయంలోనూ, మహిళలపై చేసిన వివాదాస్పద కామెంట్ల వ్యవహారంలోనూ ఇరుక్కుపోతే.. ఆయన్ని చంద్రబాబు వెనకేసుకొచ్చారు. బావమరిది బాలయ్య - 'ఆడాళ్ళు కనిపిస్తే కడుపు చెయ్యాల్సిందే..' అనంటే, ఇక్కడా మందలింపుల్లేవు. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళ కొట్లాటలు, బహుమతుల మంత్రిగారి వ్యవహారం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. పచ్చ కథలు చాలానే వున్నాయి.

ఎన్ని అరాచకాలు జరిగితేనేం, ఏ ఒక్కదాని మీదన్నా చర్యలున్నాయా.? లేవు, వుండవు కూడా. ఇంకెందుకు, చంద్రబాబు పార్టీ వేదికలపై అసహనం వ్యక్తం చేయడం.! ఏమో మరి, ఆయనగారికే తెలియాలి. త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందట.. అందుకేనేమో, ఈ మధ్య చంద్రబాబులో అసహనం ఇంకాస్త ఎక్కువగానే పెరిగిపోతోంది. కామెడీగా, మీడియాకి మేటర్‌ కోసమేలెండి ఈ అసహనం. అంతకు మించి, అసహనం ప్రదర్శించేంత సీన్‌ చంద్రబాబుకెక్కడిది.? ఇది కూడా, ఓ పబ్లిసిటీ స్టంటే మరి. 

పదేళ్ళ తర్వాత అనుకోకుండా 'బంపర్‌ ఆఫర్‌' అన్నట్టుగా తగిలిన ముఖ్యమంత్రి పదవి.. అందుకే, ఆ పదవిని ఆయన ఎంజాయ్‌ చేస్తున్నారు. పార్టీ ఎలా పోతే, ఆయనకేం.? ప్రభుత్వానికి చెడ్డపేరొస్తే ఆయనకేం.? అసలు రాష్ట్రమెలా తగలబడిపోతే ఆయనకేం.?

Show comments