బాబూ.. వాళ్ల మధ్య భలే పెట్టావయ్యా చిచ్చు!

రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గులో.. కులాల, మతాల మధ్య చిచ్చును పెట్టి దాన్ని వారు తమ స్వార్థం కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్పడానికి మరే థియరీనీ ప్రస్తావించనవసరం లేకుండా… చాలా ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. 

అసలు.. హామీ ఇచ్చే నాటికి తెలియదా? దానిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందని? అప్పుడేమో ఓట్ల కోసం కాపులను విచ్చల విడిగా వాడేశారు. రిజర్వేషన్ల తాయిలాన్ని ఆశగా చూపి.. ఎన్నికల గండాన్ని గట్టెక్కి, అధికారాన్ని సాధించుకున్నాడు. మరి పీఠం ఎక్కాకా… ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడమే గాకుండా, దానిపై అధ్యయనం అంటూ.. కాపులకు, బీసీలకు మధ్యన గట్టి చిచ్చే పెట్టాడు చంద్రబాబు నాయుడు.

కాపులకు, బీసీలకు మధ్య జాతి వైరం ఏమీ లేదు కానీ, చంద్రబాబు పుణ్యమా అని ఇప్పుడు ఈ ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. కాపులను బాబు బీసీల్లోకి చేర్చే అవకాశాలూ కనిపించడం లేదు కానీ.. ఉత్తి పుణ్యానికి కాపులు, బీసీల మధ్య జగడం జరుగుతోంది.

కాపుల రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చిన వెంటనే కొంతమంది బీసీ సంఘాల నేతలు టీవీ చానళ్లలో ప్రత్యక్షం అవుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? అని వీరు వాదిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థాయిలో ఉన్న కాపులను బీసీల్లోకి చేర్చి మా అవకాశాలను దెబ్బతీయడం ఏమిటి? అని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి వీళ్ల లాజిక్ లు వీళ్ల దగ్గర ఉన్నాయి.

ఇక ప్రత్యేకంగా బీసీల అవకాశాలను దెబ్బతీయడానికి ఏమీ కాపులు రిజర్వేషన్లు అడగడం లేదు. చంద్రబాబు చూపించిన తాయిలానికి ఆశ పడి సైకిల్ కు ఓటేసిన వాళ్లు, ఇప్పుడు  ఆ హామీని నెరవేర్చమని కోరుతున్నారు. ఒకవైపు చంద్రబాబు తో పోరాడుతున్న వాళ్ల కాళ్లకు బీసీలు అడ్డు పడడం జరుగుతోంది.

ఇక మంజునాథ కమిషన్ ప్రహసనం సరే సరి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నాడు ఈ విషయం గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందని బాబు చెప్పలేదు. నాకు అధికారం ఇస్తే చాలు.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. తర్వాతేమో అన్ని హామీలకూ తూట్లు పొడిచినట్టుగానే కాపుల ఆశలపై కూడా నీళ్లు జల్లుతూ.. రెండేళ్లు గడిచిపోయినా, ఇప్పుడు మంజునాథ కమిషన్ తో రచ్చ చేయిస్తున్నాడు.

ఇక  కాపులు, బీసీల మధ్య చిచ్చు ను రాజేయడానికి బాబుగారి అనుకూల మీడియా కూడా తనవంతు సహకారం అందిస్తోంది. మంజునాథ కమిషన్ ముందు బీసీలు నిరసన తెలిపారు అని.. కాపులను బీసీల్లోకి చేర్చాలనే ప్రతిపాదన పట్ల వీరు ఆవేదన భరితులు అయ్యారని.. కథలు, కథలుగా రాసుకొస్తోంది తెలుగుదేశం అదినేత జేబులోని మీడియా. 

ఇక్కడ సమస్య.. మంజునాథ కమిటీ తో కాదు, కాపులతో కాదు, బీసీలతో కాదు.. అసలు సమస్య చంద్రబాబు సృష్టించిందే! కాపులకు, బీసీలకు మధ్య మంటపెట్టి ఆయన చలి కాచుకుంటున్నాడు.. అనే విషయాన్ని వ్యూహాత్మకంగా తెరమరుగు చేస్తోంది. కాపులను ఒకసారి వాడుకోవడం అయిపోయింది.. ఇక బీసీల ఆవేదన అంటూ సమస్యను, తెలుగుదేశం ఎన్నికల హామీని పూర్తిగా పక్కదారి పట్టించే వ్యూహాన్ని అమలు పెడుతున్నారు. ఇంత దుర్మార్గపు రాజకీయమా! 

Show comments