ఎవరైనా మనల్ని విసిగిస్తున్నప్పుడు 'నీ వేషాలు నా దగ్గర కుదరవు' అని విసుక్కుంటాం. ఒక్కోసారి 'ఏంటి వేషాలేస్తున్నావ్' అని కసురుకుంటాం. ఇంకోసారి 'చాలించు నీ వేషాలు. అసలు సంగతి చెప్పు'...అని మందలిస్తాం. మామూలోళ్ల సంగతి అలా పక్కనుంచితే, వేషాలు వేయడంలో రాజకీయ నాయకులు సిద్ధహస్తులు. వారు ఎలాంటి మేకప్, ఆహార్యం లేకుండానే రకరకాల వేషాలేస్తుంటారు. అధికారంలో ఉన్నవారు ఒకరకంగా వేషాలేస్తే, ప్రతిపక్షంలో ఉన్నవారు మరో రకంగా వేషాలేస్తుంటారు. రకరకాల కార్యక్రమాలతో, పలు రకాల వేషాలతో నిరసన తెలిపే నాయకులుంటారు.
వేషాలేసే నాయకులు లేకపోతే నిరసన కార్యక్రమాలకు కళ ఉండదు. వేషాలేసి నిరసన తెలిపే కొందరు తెలుగు నాయకులున్నారు. వారిలో అందరికంటే ముందుగా చెప్పుకోవల్సిన పేరు ఏపీలోని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్. ఈయన నటుడు కమ్ సినిమా డైరెక్టర్ అనే విషయం చాలామందికి తెలుసు. నోటి దురుసు ఎక్కువనే ముద్ర వేయించుకున్న ఒకప్పటి సినిమా హీరోయిన్ కమ్ వైకాపా నగరి ఎమ్మెల్యే రోజాను వెండి తెరకు పరిచయం చేసింది శివప్రసాదే. టీడీపీ ఆధ్వర్యంలో ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా ఏదో ఒక వేషం వేసుకొని శివప్రసాద్ మీడియాను ఆకర్షిస్తారు.
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ పార్లమెంటు సభ్యులు సభ లోపల నిరాదాలతో హోరెత్తిస్తుండగా, శివప్రసాద్ పార్లమెంటు ఆవరణలో భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద వేషం వేసుకొని తిరిగారు. స్వామి వివేకానంద సూక్తుల పుస్తకం కూడా ఆయన చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధాని మోదీకి వివేకం కలగడానికే తాను వివేకానంద వేషం వేశానని చెప్పారు. వివేకానంద నమ్మకం ముఖ్యమని చెప్పారని, అది కోల్పోకూడదని అన్నారు. తాము బీజేపీని నమ్మి గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని, మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించారని, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని శివప్రసాద్ విమర్శించారు.
సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ రాజకీయాల్లోనే గొప్ప నాయకుడని అన్నారు. ఉప్పులేని కూర చప్పగా ఉన్నట్లు శివప్రసాద్ వేషం వేసుకురాకుండా ఉంటే ఆ నిరసన కూడా అలాగే ఉంటుందని ఆయన అభిమానులు అంటుంటారు. శివప్రసాద్ ఇలా ఎన్ని వేషాలేసినా ఏపీకి ప్రత్యేక హోదా రావడం ఉత్తమాటే. రాష్ట్ర విభజన సమయంలోనూ శివప్రసాద్ అనేక వేషాలు వేసి నిరసన తెలియచేశారు. అప్పట్లో ఈ వేషాలకు మీడియాలో బాగా ప్రచారం వచ్చింది. ఒకసారి వితంతువు వేషం వేసి రాష్ట్ర విభజన జరిగితే ఏపీ పరిస్థితి భర్త లేని మహిళ పరిస్థితిలా దీనంగా ఉంటుందన్నారు.
మరోసారి పొట్టి శ్రీరాములు వేషం చేశారు. ఇంకోసారి 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి వేషం వేసుకుని విభజనను నిరసించారు. విభజన కారణంగా ఏపీ వల్లకాడుగా మారుతుందని చెబుతూ సత్యహరిశ్చంద్ర వేషం వేశారు. ఒకసారి బుడబుక్కల సాయిబు వేషం వేసుకొని రాష్ట్ర విభజనపై సోనియా గాంధీని విమర్శించారు. కాంగ్రెసు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారం కోల్పోయిందని, విభజన జరిగితే ఆంధ్ర నుంచి ఆ పార్టీని తరిమేస్తారని అన్నారు. విభజన వద్దని ఎంత చెప్పినా వినడంలేదని, దీనికి ఆమె ఫలితం అనుభవిస్తుందన్నారు.
విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో తీవ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో శివప్రసాద్ కృష్ణుడి వేషంతో లోక్‌సభకు వెళ్లి సోనియా గాంధీ ఎదుటనే నిరసన (హిందీలో) తెలియచేశారు. అలనాడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేందుకు పాండవుల తరపున కృష్ణుడు కౌరవుల దగ్గరకు దూతగా వెళ్లాడని, ఇప్పుడు తాను సీమాంధ్ర ప్రజల తరపున దూతగా వచ్చానని, విభజన ఆపాలని కోరారు.'చెల్లియో చెల్లకో' పద్యాన్ని సోనియా గాంధీకి అన్వయించి పాడారు. అదంతా ఆమెకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఒకసారి నారదుడి వేషం, మరోసారి భీముడి వేషం వేసుకొని నిరసన తెలియచేశారు.
అప్పుడు ఎన్ని వేషాలేసినా విభజన ఆగలేదు. మోదీ సర్కారు ఏపీకి చేస్తున్న అన్యాయంపై, అరకొర సాయంపై గతంలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఒకటి రెండుసార్లు ధర్నాలు చేసి నిరసన తెలియచేశారు. ఆ సమయంలో ఒకసారి పార్లమెంటు సమావేశాల మొదటి రోజునే కుచేలుడి వేషం వేసి రాష్ట్రం దీనావస్థపై పాట పాడారు. 'ఇంతింత ఇంతింత విదిలించినట్లుంటే లోటు ఎప్పుడు పూడునో..ఆంధ్ర రాత ఎప్పుడు మారునో' అని పాడారు. ప్రస్తుతం టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసన కంటిన్యూ అవుతే ఈయన కూడా వరుసగా వేషాలు వేస్తారేమో....!