పుట్టిన రోజుతో.. హీరోగారి పాలిటిక్స్ కు శుభం కార్డు?

రాజకీయ వ్యూహలేమితో, చతురతతో వ్యవహరించకపోవడంతో.. తీవ్రమైన అవమానాలను ఎదుర్కోనే దిశగా వెళ్తున్నాడు తమిళ హీరో విజయ్ కాంత్. గత ఎన్నికల్లో జయలలిత కు వ్యతిరేకంగా పోటీ చేసి, ఆమెకు దిగ్విజయాన్ని అందించిన ఈ హీరోగారి రాజకీయ జీవితానికి శుభం కార్డు పడే గడియ ఆసన్నం అవుతోంది.

వచ్చే నెలలో పుట్టిన రోజు సందర్భంగా విజయ్ కాంత్ తన పార్టీని రద్దు చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ రణరంగం నుంచి వైదొలుగుతున్నట్టుగా విజయ్ కాంత్ పుట్టిన రోజునాడు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో దారుణ ఓటమిని ఎదుర్కోవడం, తను కూడా ఎమ్మెల్యేగా గెలవడం మాట అటుంచి, కనీసం రెండోస్థానాన్ని కూడా సంపాదింలచేకపోవడం.. విజయ్ కాంత్ ను ఇబ్బంది పెట్టే అంశాలుగా మారాయి.

ఈ నేపథ్యంలో పార్టీని రద్దు చేయాలని విజయ్ కాంత్ ఇప్పటికే డిసైడయ్యాడని అంటున్నారు. మరోవైపు విజయ్ కాంత్ తీరును వ్యతిరేకిస్తూ ఎన్నికల ముందే కొంతమంది మరో ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోకి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు కూడా ఇప్పటికే విజయ్ కాంత్ తీరుపై మండిపడుతూ.. త్వరలోనే డీఎంకే తీర్థం పుచ్చుకోనున్నామని ప్రకటనలు చేస్తున్నారు. Readmore!

మరి కేవలం అధికారం మీద యావ అయ్యుంటే.. ఇలాంటి వాళ్లు అన్నాడీఎంకేలో చేరిపోవాల్సింది. కానీ.. వారు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేలో చేరుతున్నామని అంటున్నారంటే.. విజయ్ కాంత్ లోపాలేమిటో స్పష్టం అవుతోంది. త్వరలో జరగనున్న తమిళనాడు స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు విజయ్ కాంత్ ఇప్పటికే ప్రకటన చేశాడు!

అంతకు మించి చేయగలిగింది కూడా ఏమీ లేదు కాబోలు. పార్టీలో ఇంకా మిగిలిన వారు తనపై తిరుగుబాటు చేసి.. డీఎంకేలో చేరిపోవడానికి ముందే.. పార్టీని రద్దు చేసి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ నల్ల ఎంజీఆర్. అందుకు ముహూర్తంగా వచ్చే నెల 25 వ తేదీని నిర్ణయించారు. అయితే అంతలోపే తిరుగుబాటు నేతలు డీఎంకేలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments