దేవినేని ఎంట్రీ.. కృష్ణా టీడీపీలో ప్రకంపనలు స్టార్ట్!

ఎవ్వరినీ వదలం.. ఎవరొస్తే వారిని చేర్చుకుంటాం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి చేరికల వల్ల అంతిమంగా ఏం లాభపడుతుందో ఎన్నికలొస్తే కానీ తెలియదు. రాజకీయ నిరుద్యోగులను, రాజకీయ వితంతువులకు తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చి.. ఇదంతా “అభివృద్ధి’ కి నిదర్శనం అని చెప్పుకొంటూ ఆ విధంగా ముందుకు పోతోంది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో నేతలకు ఎరలు వేసి.. వారిని చేర్చేసుకుని.. సొంత మీడియాతో సంబరాలు జరిపించుకుంటున్నారు.

ఏ కాంగ్రెస్ నేతల మీదనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి పోసే వాడో.. ఆ కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం నేతలైపోయారు. ఈ జాబితాలో ఇటీవల చేరిన వ్యక్తి దేవినేని నెహ్రూ. మరి ఈ దేవినేని నెహ్రూ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.. బాబు విషయంలో ఎలాంటి తీవ్రమైన భాష మాట్లాడాడు, ఎన్టీఆర్ విషయంలో ఎంతటి ఆవేదనను వ్యక్తం చేశాడు.. ఇప్పుడు ఈయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఏమిటి? అనే సంగతులు పక్కన పెడితే.. దేవినేని నెహ్రూ చేరిన  నేపథ్యంలో కృష్ణా జిల్లా తెలుగుదేశంలో ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయని స్పష్టం అవుతోంది.

ప్రత్యేకించి ఇప్పటికే పలు గ్రూపులుగా విడిపోయిన కృష్ణా జిల్లా తమ్ముళ్లు మధ్య దేవినేని చిచ్చుగట్టిగానే రగులుకుంటోంది. ప్రత్యేకించి నెహ్రూ చేరికతో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండగా నిలబడిన కాపుల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పై, ముద్రగడతో వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న కాపుల పుండుపై దేవినేనిని చేర్చుకుని చంద్రబాబు కారం జల్లాడు.

జిల్లా తెలుగుదేశంలో చాలా వర్గాలున్నాయి. గతంలో కాంగ్రెస్ లో జరిగిన గ్రూపు కలహాలకు మించిన స్థాయిలో తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికే దేవినేని ఉమ  .. నెహ్రూ, ఆయన తనయుడికి తెలుగుదేశం తీర్థం ఇప్పిస్తున్నాడనే చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దేవినేని ఎంట్రీ తెలుగుదేశంలోని కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే అలర్ట్ అయ్యారు. నెహ్రూ తనయుడు వచ్చే ఎన్నికల్లో తమ టికెట్ కు ఎసరు తెస్తాడని కొంతమంది తెలుగుదేశం నేతలు మధనపడుతున్నారు. 

ఇక ఆధిపత్య పోరు సరేసరి! ఇలా పార్టీలోని కమ్మ వాళ్లలోనే దేవినేని ఎంట్రీ అభద్రతాభావాన్ని, అశాంతిని రగులుస్తోంది. ఇక కాపుల కోణం నుంచి చూస్తే.. దేవినేని తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం అనేది ఈ పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బ అని చెప్పాలి. దేవినేని తెలుగుదేశంలో చేరతాడు అనే వార్త  వచ్చినప్పుడే.. టీడీపీకి సపోర్ట్ గా నిలిచిన చాలా మంది కాపులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ లాంఛనం  కాస్తా పూర్తి కావడంతో.. వీరిలో చాలా అసహనమే కనిపిస్తోంది.

ఈ అసంతృప్తిని బహిరంగంగా చాటడానికి కూడా వారు వెనుకాడటం లేదు.  తెలుగుదేశం ఎమ్మెల్యే హోదా లో ఉన్న బోండా ఉమ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ ఇండికేషన్ తో వేయించిన ఫ్లెక్సీలు వేయించడం అనేది దేవినేని ఎంట్రీ పుణ్యమే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే హోదాలోని వ్యక్తే ఇలా వ్యవహరించాడంటే.. దేవినేని ఎంట్రీతో కాపులు తెలుగుదేశానికి ఎంత దూరం అయ్యారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. కాపులు టీడీపీకి పూర్తిగా దూరం అయినట్టే.. ఇది ఆరంభం మాత్రమే.. నెహ్రూ చేరికతో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండగా ఉన్న కమ్మ వాళ్ల మధ్యనే తీవ్రమైన పోరు జరగనుంది, ముందు ముందు ఈ రచ్చ తీవ్ర స్థాయికి చేరుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments