మోత్కుపల్లికి ఇంకా ఆశ మిగిలుందా...?

రాజకీయ నాయకులు ఆశాజీవులు. పదవులు లేనివారు ఎప్పుడో ఒకప్పుడు  పదవులు వస్తాయని ఆశపడుతుంటారు. ఏదో ఒక పదవి సంపాదించుకున్నవారు ఇంకా మంచి పదవి, మరింత ఉన్నతస్థానం దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తుంటారు. కొందరికి రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే మంచి పదవులు వస్తాయి. కొందరు ఏళ్ల తరబడి  కిందామీదా పడుతున్నా ఏ పదవీ దక్కదు.  ఎలాంటి పదవులు నిర్వహించకుండానే  అసంతృప్తితోనే జీవితాలు ముగిస్తారు. పదవులు వచ్చినవారు ప్రతిభావంతులు, సేవా దురంధరులు కారు. రానివారు పనికిమాలినవారు కాదు. 

కులం, వర్గం, డబ్బు, సర్దుబాట్లు, ఒత్తిళ్లు...ఇలా అనేక కారణాలు పదవులు రావడానికి, రాకపోవడానికి దోహదం చేస్తుంటాయి. దేనికైనా అదృష్టం ఉండాలనుకుంటారు కొందరు. తెలంగాణ టీడీపీ సీనియర్‌ నాయకుడు, అధినేత చంద్రబాబుకు విధేయుడు అయిన మోత్కుపల్లి నర్సింహులుకు అదృష్టం కలిసిరావడంలేదు. అయినప్పటికీ  మళ్లీ గవర్నర్‌ పదవిపై ఆశలు పెంచుకుంటున్నారని సమాచారం. ఎందుకు? ఎలా? తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పదవీ విరమణ చేయగానే తనకు అవకాశం వస్తుందని, చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి తనకు పదవి ఇప్పిస్తారని ఆశపడ్డారు. ఆయన ఆశకు చాలా వయసుంది. 

రాష్ట్ర విభజన తొలి రోజుల్లోనే చంద్రబాబు మోత్కుపల్లికి వాగ్దానం చేశారు. టీడీపీ నుంచి ఇద్దరికి, సాధ్యం కాకుంటే ఒక్కరికైనా గవర్నర్‌ పదవి ఇస్తానని కేంద్రం బాబుకు హామీ ఇచ్చిందట...! ఆ పదవి తెలంగాణ నాయకుడికి ఇప్పించి అక్కడ పార్టీని బలోపేతం చేయాలని బాబు అనుకున్నారు. కాని 'అనుకున్నదొక్కటి అయ్యిందొకటి' అన్నట్లుగా తయారైంది పరిస్థితి. రోశయ్య దిగిపోగానే మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావును తమిళనాడుకు ఇన్‌చార్జిగా నియమించింది కేంద్రం. సాధారణంగా పక్క రాష్ట్రం గవర్నర్‌నే ఇన్‌చార్జిగా నియమిస్తారు. ఆ లెక్కన కర్నాటక గవర్నర్‌ను నియమించాల్సింది. 

కాని తమిళనాడులో ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత మాటే చెల్లుబాటు కావాలి కదా. కర్నాటకతో తమిళనాడుకు కావేరి జలాల వివాదం నడుస్తుండటంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ను ఇన్‌చార్జిగా నియమించొద్దని జయ కేంద్రాన్ని కోరరాట. దీంతో విద్యాసాగర్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. ఇన్‌చార్జి అంటే తాత్కాలికమే కదా. కొన్నాళ్ల తరువాత విద్యాసాగర్‌రావు స్థానంలో మరొకరిని నియమించాల్సిందే. ఈ పాయింటును పట్టుకొని మోత్కుపల్లి ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. కొత్త గవర్నర్‌ను నియమించాల్సిన సమయం వచ్చినప్పుడు కేంద్రం మోత్కుపల్లి పేరు పరిశీలిస్తుందని సన్నిహితులు చెబుతున్నారట. 

కాని ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో, బీజేపీ-టీడీపీ సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితిలో కేంద్రం దృష్టిలో మోత్కుపల్లి ఉంటాడా? అనేది అనుమానమే. ప్రధాని మోదీ దగ్గర చంద్రబాబు మాట చెల్లుబాటు కావడంలేదనే విషయం అనేక సందర్భాల్లో బయటపడింది. తాజాగా చంద్రబాబు కేంద్రంతో సంబంధాలు తెంచుకుంటామని చెప్పడం బీజేపీ నాయకులకు ఆగ్రహం తెపిస్తోంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లిని ఎవరు పట్టించుకుంటారు? కేంద్రం మోత్కుపల్లికి పదవి ఇవ్వాలనుకుంటే రోశయ్య దిగిపోగానే ఇచ్చేది. ఆ ఉద్దేశం లేదు కాబట్టే విద్యాసాగర్‌రావును ఇన్‌చార్జిగా నియమించింది. 

కొంతకాలం తరువాత బీజేపీ నాయకుడినో, నాయకురాలినో నియమించొచ్చు. మహిళా గవర్నర్‌ కావాలని జయలలిత కూడా అడిగారట...! మోత్కుపల్లి టీడీపీ సమావేశాల్లో బాబుకు 'గవర్నర్‌గిరి' గురించి గుర్తు చేశారు. అప్పటికేదో ఓదార్చారు. ఈలోగా బీజేపీతో విభేదాలు ముదిరాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో   మోత్కుపల్లి దానిపై ఆశ పడ్డారు. తిరుపతి మహానాడులో పబ్లిగ్గానే వేడుకున్నారు. తాను చంద్రబాబుకు హనుమంతుడి వంటి భక్తుడినని, తన జీవితం టీడీపీకే అంకితమని అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన మినీ మహానాడులోనూ తెలంగాణకు ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వాలని తీర్మానం చేశారు. కాని అది సాధ్యమయ్యేలా లేదని లోకేష్‌ చావు కబురు చల్లగా వినిపించాడు. 

తిరుపతి మహానాడులో మోత్కుపల్లిని చంద్రబాబు 'గవర్నర్‌ మోత్కుపల్లి' అని సంభోదించారు. ఆయన సరదాగా అనుండొచ్చు. కాని ఈయన సీరియస్‌గా తీసుకొని కలల్లోకి వెళ్లిపోయారు. చివరకు అది కలగానే మిగిలిపోయింది. తెలంగాణ టీడీపీ నాయకుల్లో కొందరు బాబు చేతిలో మోత్కుపల్లి మోసపోయాడని అంటున్నారట...! ఆయన పరిస్థితికి జాలి పడుతున్నారట...! ఏదిఏమైనా మోత్కుపల్లిలో ఒకప్పటి వీరావేశం ఇప్పుడు లేదు. కేసీఆర్‌ మీద ఒంటికాలిపై లేచిన నాయకుడు ఇప్పుడు తాను ఒంటరినని ఫీలవుతున్నారట...! 

Show comments