ఒంటరితనం గుర్తుకొస్తోంది: టబు

నలభయ్యేళ్ళు పైబడ్డాక అందాల భామ టబుకి ఒంటరితనం గుర్తుకొచ్చింది. 'ఏమో, పెళ్ళి చేసుకుంటానో లేదో నాకైతె తెలియదు.. కానీ, ప్రేమని చాలా మిస్‌ అయ్యాను. ఆ ఒక్కటీ నా జీవితంలో పెద్ద వెలితి. కెరీర్‌ మీదనే దృష్టిపెట్టడంతో, వయసు మీద పడ్తుందన్న విషయం కూడా తెలుసుకోలేకపోయాను..' అంటూ టబు తన మనసులో మాటని బయటపెట్టింది. 

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా వచ్చిన 'కూలీ నెంబర్‌ 1' హీరోయిన్‌గా టబుకి తొలి సినిమా. తెలుగులోనూ, హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది టబు. ఆ మాటకొస్తే, తెలుగులోకన్నా హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేసిన టబు, ఎన్నో అవార్డుల్ని కూడా తన సొంతం చేసుకుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే, నటిగా తాను సాధించిన పేరు ప్రఖ్యాతులు తనకెంతో ఆనందాన్నిస్తున్నాయంటోంది టబు. 

టాలీవుడ్‌కి సంబంధించినంతవరకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ తదితర అగ్రహీరోల సరసన నటించింది టబు. వీరందరిలోకీ నాగార్జునతోనే టబుకి ఎక్కువ సినిమాలున్నాయి. తాజాగా నాగార్జున తనయుడు అఖిల్‌ హీరోగా నటించనున్న సినిమాలో టబు ఓ కీలక పాత్రలో కన్పించనున్న విషయం విదితమే. 

ఇదిలా వుంటే, ఒంటరితనం గుర్తుకొస్తోందంటూ టబు చెప్పిన మాటలతో, త్వరలోనే ఆమె పెళ్ళి కబురు చెప్పబోతోందని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

Show comments