పంజాబ్ లో ఏవో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని భారతీయ జనతా పార్టీ వాళ్లు చెప్పుకొంటూ.. డినామినేషన్ పట్ల ఇదే ప్రజల రెఫరండం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి పంజాబ్ లో గెలిచిన వాళ్లు.. మహారాష్ట్రలో ఎందుకు వెనుకబడ్డారు? మరాఠా గడ్డ మీద అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడ కాంగ్రెస్ కన్నా వెనుకబడింది, స్థానిక ఎన్నికలతో కాంగ్రెస్ కోలుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి!
అయితే మోడీ భక్తులు మహారాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడరు. ఆ సంగతలా ఉంటే.. మోడీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. జాతీయ వాద సెంటిమెంటును రగిల్చి, హిందుత్వ వాదాన్నీ వాడుకొంటూ.. అవినీతిని అంతం చేస్తాను, ఉగ్రవాదాన్ని దునుమానుడుతాను.. వంటి నినాదాలతో అధికారంలోకి వచ్చిన మోడీ గారు.. ఇప్పటికే చాలా విషయాల్లో అంచనాలను అందుకోలేకపోయారు.
సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయంగా వాడుకోవడం తోనే బీజేపీ చాలా మెట్లు పతనం అయ్యింది. ఇక విదేశాల్లోని బ్లాక్ మనీ వంటి వ్యవహారాల్లో కూడా మోడీ ఫెయిల్యూర్స్ స్పష్టం అయ్యాయి. ధరల పెరుగుదలలో నియంత్రణ లేదు, రూపాయి విలువ పతనం కొనసాగుతోంది.. ఇలా పలు రకాలుగా మోడీ ఇమేజ్ ఇప్పటికే డ్యామేజ్ అయ్యింది.
ఇలాంటి నేపథ్యంలో ఏదో చేయబోయి.. డినామినేషన్ తో జనాలను రోడ్డు మీదకు ఈడ్చాడు ప్రధానమంత్రి. ఈ విధమైన తీరుతో మోడీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రత్యర్థులు కొంతమందిలో ఆత్మవిశ్వాసం ప్రోది అయ్యింది. అందుకు ఉదాహరణ అఖిలేష్ యాదవ్.
మొన్నటి వరకూ ఎస్పీ ఫస్ట్ ఫ్యామిలీ అంతర్గత కలహాలతో అఖిలేష్ అల్లాడిపోయాడు. అయితే ఇప్పుడు యూపీలో వీరి గొడవ ను అంతా మర్చిపోయారు. దీనికి కారణమంతా మోడీ గారే. ఆయన తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సంభవించిన పరిణామాల నేపథ్యంలో.. జనాలకు వాళ్ల కష్టాలే మిగిలాయి. వేరే వ్యవహారాలను పట్టించుకునే పరిస్థితి లేదు. నోట్ల రద్దు నిర్ణయంతో బీజేపీపై వ్యతిరేకత ప్రబలిందని.. ఇది తమకు మేలు చేస్తుందని అఖిలేష్ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడీయన.