ఇక మన్మోహన్ మీద పడి రక్కండి

ఆవేశం లేదు, రాజకీయ విమర్శలు లేవు, ధ్వేషపూరితమైన మాటల్లేవు, అర్థం లేని ఆరోపణలు.. అక్కసు వెల్లగక్కడం లేదు.. భావోద్వేగాలు రెచ్చగొట్టే యత్నం లేదు… సూటిగా, స్పష్టంగా… తన అభిప్రాయాన్ని చెప్పారు మన్మోహన్ సింగ్.

మోడీ నిర్ణయాన్ని ఎవ్వరు తప్పుపట్టినా వాళ్ల మీద పడి రక్కుతాం.. అనే వాళ్లను వాళ్ల పిచ్చివాళ్ల స్వర్గంలో వదిలిపెడితే.. మోడీ నిర్ణయం వల్ల జీడీపీలో రెండు శాతం తగ్గుదల ఉంటుందని ఆ ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు. జీడీపీ అంటే నిర్వచనం తెలియని వాళ్లు కూడా.. ‘అంతే కదా.. ఇప్పుడు నష్టం ఉన్నా.. ముందు ముందు మంచి జరుగుతుంది..’ అని అనేయొచ్చు.

ఎకనామిక్స్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్, ఆర్బీఐ గవర్నర్, సంస్కరణల బాట పరిచిన ఆర్థిక శాఖ మంత్రి, రెండు సార్లు ప్రధానమంత్రి.. ఇవీ మన్మోహన్ కు ఉన్న అర్హతలు.

ఆయన రాజకీయ నేపథ్యాన్ని పక్కన పెట్టి చూసినా.. ఆర్థికవేత్తగా ఆయనను తక్కువ అంచనా వేయడం, ఆయన ఏదో దురుద్దేశం కొద్దీ సభలో ఇలా మాట్లాడాడు అని అనడం.. నిజంగా హేయమైన చర్య అవుతుంది.

మూఢ మోడీ భక్తులు మన్మోహన్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? 2జీ పై ఎందుకు మాట్లాడలేదు? అనొచ్చు. కానీ అలాంటి స్కామ్స్ జరిగింది కాంగ్రెస్ హయాంలోనే అనుకుంటే, అవి వెలుగులోకి వచ్చింది కూడా అదే పార్టీ హయాంలో అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వస్తోంది. 2జీ విషయంలో దేశం యావత్తూ మన్మోహన్ గవర్నమెంటుపై విరుచుకుపడింది. ఇప్పటిలా మూఢభక్తిలో సమర్థించలా!

మన్మోహన్ ఒకే ఒక్క ప్రశ్న వేశారు. “ ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును తిరిగివ్వలేని దేశం ఏదైనా ఉందా?’’ అని. నోట్ల రద్దు వెనుక ఏవైనా సదుద్దేశాలు ఉంటే.. వాటిని తను వ్యతిరేకించడం లేదు, తప్పుపట్టడం లేదు అంటూ.. దీన్ని వ్యవస్థీకృతమైన దోపిడీగా, చట్టపరంగా చేసిన భారీ తప్పిదంగా అభివర్ణించారు మన్మోహన్. ఓవరాల్ గా దీన్ని అర్థం లేని చర్య అని స్పష్టం చేశారు.  

Show comments