అతి పెద్ద నాలుగో 'టెర్రర్‌' సంస్థ....!

టెర్రరిజం...ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. కొంతకాలంగా ఏదో ఒక దేశంలో తరచుగా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదం పేరు చెప్పగానే ఎవ్వరికైనా ఇస్లామిక్‌ ఉగ్రవాదమే గుర్తుకొస్తుంది. ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలే యూరోపియన్‌, ఇతర పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా, అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల్లోనూ భయంకరమైన దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి సంబంధించి పలు సంస్థలున్నప్పటికీ కొంతకాలంగా ప్రపంచాన్ని భయకంపితులను చేస్తోంది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌ఎస్‌). 

2015లో ప్రపంచంలో 11,774 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 28,328 చనిపోయారు. 35,320 మంది గాయపడ్డారు. ఉగ్రవాద దాడుల కారణంగా ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ తరువాత ఎక్కువగా నష్టపోయిన దేశం ఇండియా. ఇక్కడ 791 దాడులు జరగ్గా వాటిల్లో 43 శాతం మావోయిస్టుల (నక్సలైట్లు) కారణంగా జరిగాయి. ఈ దాడుల్లో 289 మంది చనిపోయారు. అమెరికాకు చెందిన నేషనల్‌ కన్సార్టియమ్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ టెర్రరిజం అనే సంస్థ ప్రపంచంలో అతి ప్రమాదకరమైన నాలుగు ఉగ్రవాద సంస్థలున్నట్లు తెలియచేసింది. 

మొదటి మూడు తాలిబన్‌, ఇస్లామిక్‌ స్టేట్‌, బొకొహరం కాగా, నాలుగో సంస్థ మావోయిస్టు  పార్టీ. మిగతావి ఉగ్రవాద సంస్థలు కాగా, సీపీఐ (మావోయిస్టును)ను తీవ్రవాద రాజకీయ పార్టీగా మనం పరిగణిస్తున్నాం. ఈ నిషేధిత పార్టీ మన దేశంలో ప్రత్యక్షంగా పనిచేస్తోంది. ఇరుగు పొరుగు దేశాల్లో (ప్రధానంగా నేపాల్‌) చురుగ్గా ఉంది. గత ఏడాది 343 ఉగ్రవాద దాడులకు తమదే బాధ్యతని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. తాలిబన్లకు 1,093 దాడుల్లో ప్రమేయం ఉంది. ఈ దాడుల్లో 4,512 మంది చనిపోయారు. 

ఐఎస్‌ఐఎస్‌ చేసిన 931 దాడుల్లో 6,050 మంది ప్రాణాలు కోల్పోయారు. బొకొహరం 491 దాడులు చేయగా 5,450 మంది చనిపోయారు. ఉగ్రవాదంలో కుర్దిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీ ఐదో స్థానంలో ఉంది. ఇది 238 దాడులు చేయగా 287 మంది చనిపోయారు. మన దేశంలో ఉగ్రవాద దాడులు పాకిస్తాన్‌ నుంచి కూడా జరిగినప్పటికీ ఎక్కువగా మావోయిస్టుల దాడులే ఉన్నాయి. ఈ దాడుల్లో సగం నాలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి. అవి: ఛత్తీస్‌ఘర్‌ (21 శాతం), మణిపూర్‌ (12 శాతం), జమ్ము కశ్మీర్‌ (11 శాతం), జార్ఖండ్‌ (10 శాతం). 

అయితే మావోయిస్టుల దాడుల కారణంగా ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం ఛత్తీస్‌ఘర్‌. మావోయిస్టులు 2014లో 76 దాడులు జరపగా, 2015లో ఆ సంఖ్య 167కు పెరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిన్నాచితక తీవ్రవాద సంస్థలన్నీ కలిపి 45 వరకు ఉన్నాయి. అన్నింటిలోనూ అగ్రస్థానంలో ఉన్నది మావోయిస్టు పార్టీ. పది రాష్ట్రాల్లోని 106 జిల్లాల్లో మావోయిస్టులు ప్రభుత్వాలకు సవాలుగా మారారు. ఇండియాలో ఉగ్రవాద సంస్థల కిడ్నాపింగ్‌లు (పర్యాటకులు, అధికారుల అపహరణలు) కూడా బాగా పెరిగిపోయాయి. 2014లో 305 అపహరణలు జరగ్గా 2015లో 862 జరిగాయి. 

వీటిల్లో మావోయిస్టులు చేసిన అపహరణలు గత ఏడాది 707 కాగా, అంతకు ముందు సంవత్సరం 163. కేంద్ర హోం శాఖ లెక్కల ప్రకారం 2010-15 మధ్య మావోయిస్టుల దాడుల కారణంగా దేశంలో 2,162 మంది పౌరులు, 802 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. మావోయిస్టుల దాడుల్లో ప్రముఖ నాయకులు, మంత్రులు చనిపోయారు. చంద్రబాబు నాయుడు మావోయిస్టుల బారి నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను సానుభూతిగా మలచుకొని ఎన్నికల్లో గెలవాలనుకున్నారు. కాని సాధ్యం కాలేదు. 

వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపినా ముందుకు పోలేదు. ఒకప్పుడు ఎన్‌టీ రామారావు నక్సలైట్లు దేశభక్తులని ప్రశంసించారు. మావోయిస్టుల ఎజెండాయే మా ఎజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎజెండా అమలు జరగలేదుగాని ఎన్‌కౌంటర్లు జరిగాయి. ప్రపంచీకరణ ప్రభావం కావొచ్చు, ఇతర సామాజిక పరిణామాలు కావొచ్చు ఇప్పటి విద్యావంతులైన యువత మావోయిస్టుల వైపు ఆకర్షితులు కావడంలేదు. 

ఒకప్పుడు మావోయిస్టుల్లో మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నత విద్యావంతులు ఎందరో చేరారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. వాస్తవానికి ఫలానా వాళ్లు ఉగ్రవాదులని చెప్పే నైతిక అర్హత అమెరికాకు లేదు. ఎందుకంటే అది చాలా దేశాల్లో ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

Show comments