చేపా చేపా ఎందుకు ఎండలేదు.?

'డిసెంబర్‌ 30వ తేదీ వరకూ అవకాశం వుంటుంది.. పెద్ద పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు.. ఎలాంటి తొందర లేదు.. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పనిలేదు.. క్యూ లైన్లలో సొమ్మసిల్లాల్సిన అవసరం లేదు.. తీరిక చూసుకుని, బ్యాంకుల వద్ద ఖాళీగా వున్నప్పుడే వెళ్ళి ఆ పని పూర్తి చేసుకోండి..' 

- కొన్నాళ్ళ క్రితం.. అంటే, కేంద్రం పెద్ద పాత నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌ మాత్రమే కాదు, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, బీజేపీ మిత్రపక్షాలకు చెందిన నేతలు చెప్పిన మాటల సారాంశమిది. 

40 రోజుల తర్వాత సీన్‌ మారిపోయింది. ఇన్నాళ్ళపాటు ఎందుకు సమయం వృధా చేశారో పేర్కొంటూ, ఇకపై బ్యాంకుల్లో పెద్ద పాత నోట్లను జమ చేసుకోవాలి. అదీ, బ్యాంకు అధికారులు మీ వివరణతో సంతృప్తి చెందితేనే, మీ వద్దనున్న పెద్ద పాత నోట్లు బ్యాంకుల్లో జమ అవుతాయి. లేదంటే, అవి ఇకపై చిత్తు కాగితాలే. 

పిచ్చి తుగ్లక్‌ పాలనకీ, ప్రస్తుత పాలనకీ తేడా ఏమన్నా వుందా.? నవంబర్‌ 8 తర్వాత, అటు కేంద్రం - ఇటు రిజర్వు బ్యాంకు.. పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నాయి. పెద్ద పాత నోట్ల రద్దు ప్రక్రియ ఎంత ఫెయిల్యూర్‌ అని కేంద్రం, రిజర్వు బ్యాంకు భావించి వుండకపోతే, ఇంతలా పిచ్చి పిచ్చి నిబంధనలు తెరపైకి వస్తాయట. కేంద్రం జారీ చేసిన ఓ నోటు చెల్లదని చెప్పే అధికారం ఎవరికి వుంది.? అన్నదానిపై పెద్ద చర్చే జరుగుతోంది ఓ పక్క. ఇంకోపక్క, ప్రధానమంత్రి నవంబర్‌ 8వ తేదీనే పెద్ద పాత నోట్లు చిత్తుకాగితాలనేశారు. కానీ, ఆ పెద్ద పాత నోట్లు ఇప్పటికీ చెల్లుతున్నాయి.. ఆ దిశగా కేంద్రమే వెసులుబాటు కల్పించింది. అంటే, ప్రధాని మాటకు విలువ ఏమున్నట్లు.? 

బ్యాంకుల్లో తమ వద్దనున్న పెద్ద పాత నోట్లను బ్యాంకుల్లో చాలామంది జమచేయలేకపోయారు. అందుక్కారణాలనేకం. 'ఇంకా సమయం వుంది కదా.. క్యూ లైన్లలో నిల్చుని, ప్రాణాలు పోగొట్టుకోవడమెందుకు.?' అని కొందరు భావించి వుండొచ్చు. 'ఏమో, గడువు ఇంకాస్త పొడిగింపబడ్తుందేమో..' అన్న ఆలోచన కూడా వుండి వుండొచ్చు. అయినా, డిసెంబర్‌ 30 వరకూ గడువు వున్నప్పుడు, ఈ పిచ్చి తుగ్లక్‌ నిబంధన ఏంటట.? ఓహో, బ్యాంకుల వద్ద క్యూ లైన్లు తగ్గాయి కాబట్టి, మళ్ళీ క్యూలైన్లను పెంచేసి, మరికొంతమందిని 'పైకి పంపించే' పథకాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిందేమో.!

Show comments