కక్కిన కూటి కోసం కమలం పార్టీ కక్కుర్తి!

భారతీయ జనతా పార్టీ తీరును గమనిస్తే ఒక ‘పంచతంత్ర’ కథ గుర్తుకు వస్తుంది. అరణ్యంలోని ఒక నక్క ను ప్రధాన పాత్రలో పెట్టి కక్కుర్తి పనికిరాదు అని ఆ కథలో హితోపదేశం చేశారందులో. ఇంతకీ కథేమిటంటే… అనగనగా ఒక అరణ్యం. ఆ అడవిలోకి వేట కోసం సంచరిస్తున్న వేటగాడికి పంది కనిపిస్తుంది. ఆ అడవి పందిని చూడగానే వేటగాడు ఉత్సాహంగా బాణమేస్తాడు. ఆ పంది బలిష్టమైనది, వేటగాడు వదిలిన బాణం దానికి తగిలినా అది సులభంగా చావదు. బాణం తగిలిన నొప్పితో విలవిలాడుతూనే వేటగాడి మీదకు దూకుతుంది అది. దాని దెబ్బ ఛాతికి గట్టిగా తగలడంతో వేటగాడూ అక్కడే చచ్చిపోతాడు. బాణం దెబ్బకు తాళలేక అడవి పందీ ప్రాణాలు విడుస్తుంది. అటుగా వెళ్తున్న పాము ఈ రెండు జీవాల మధ్యన నలిగి చనిపోతుంది. అప్పుడు వస్తుంది అక్కడికో నక్క!

ఆకలి మీద అంత ఆహారాన్ని చూసే సరికి అది ఉబ్బి తబ్బిబ్బు అవుతుంది. పంది మాంసం, మనిషి మాంసం, పాము.. చచ్చిపడిన స్థితిలో ఉన్నాయన్నీ. కాబట్టి కష్టపడాల్సిన అవసరమే లేదు, కొన్ని రోజుల పాటు సుష్టుగా ఈ మాంసాన్ని భోంచేయవచ్చు అనే లెక్కలేసుకుంటుంది అది. అంత మాంసం అయాచితంగా లభించే స్థితిలో కూడా ఆ నక్కలో లోభం చావదు. మాంసాన్ని దాచుకుందాం.. ప్రస్తుతానికి వేటగాడి బాణానికి ఉన్న వింటి నారి ని కొరుక్కుతిని సంతృప్తి పడదామని ఆ నక్క భావిస్తుంది. అంత మాంసాన్ని వదిలి.. బాణానికి ఉన్న వింటినారిని నోటితో కొరుకుతుంది. అంతే… వింటినారి తెగడంతో.. వంచి ఉన్న విల్లు ఒక్కసారిగా వచ్చి తగులుతుంది. ఆ దెబ్బకు అదే నిమిషంలో ప్రాణమొదులుతుంది ఆ నక్క. 

కథలోని నక్క లాంటి లోభి.. బీజేపీ. అంత మాంసం ఉన్నా, కక్కుర్తి కొద్దీ  వింటినారి కొరికి ప్రాణం పోగొట్టుకున్న నక్క తీరున వ్యవహరిస్తోంది కమలం పార్టీ. దేశాన్నంతా పాలించమని  ప్రజలు స్పష్టమైన మెజారిటీతో కమలం పార్టీకి అధికారాన్ని అప్పగించారు. అంతేనా.. గత రెండేళ్లలో ఎన్నో రాష్ట్రాలు బీజేపీ పాలన కిందకు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు కమలానికి పట్టం గట్టి పాలించమంటున్నారు.

మరి దేశ జనాలు కమలానికి ఇంత సహకారం ఇస్తుంటే.. ప్రజస్వామ్యంలో ప్రజలు దగ్గరుండి పట్టం గడుతుంటే.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ  చేవను చాటుకోవాల్సిన బీజేపీ నేతలు.. అప్రజాస్వామ్యిక విధానాలను అవలభించడంలో పండి పోతుండటాన్ని కథలోని లోభితో పోలిస్తే సరిపోతుందా? లేక అంతకన్నా పర్వర్టెట్ అనుకోవాలా?

ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ విషయలో భారతీయ జనతా పార్టీ కి చెంప దెబ్బలు పడ్డాయి. అక్కడ స్పష్టమైన మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కమలం చేసిన యత్నాలు విఫలం అయ్యాయి. గవర్నర్ ను ఉపయోగించుకుని.. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టినా, కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది.ఇదంతా జరిగి రెండు నెలలు అయ్యింది. ఇంతలోనే ఏకంగా కాంగ్రెస్ ను తుడిచి పెట్టే రాజకీయాన్ని కమలం నెత్తికెత్తుకుంది. ఒకేసారి ముఖ్యమంత్రితో సహా 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత పార్టీ ఫిరాయింపు చేసి.. తమకు అనుకూల కూటమిని ఏర్పరిచింది బీజేపీ అధిష్టానం. వారంతా డైరెక్టుగా బీజేపీలో చేరితే విమర్శలు వస్తాయని.. తమకు మిత్రపక్షం అయిన పార్టీలోకి చేర్చి.. దాన్ని బీజేపీలోకి విలీనం  చేసుకునే వ్యూహాన్ని అమలు పెట్టింది బీజేపీ అధినాయకత్వం.

ప్రజాస్వామ్యాన్ని పాతరేయడం.. నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం.. అనడమే కాదు, ఇంత దేశాన్ని పాలించే అధికారాన్ని చేతిలో పెట్టుకున్న బీజేపీ అంత చిన్న అరుణాచల్ విషయంలో ఇంత కక్కుర్తి ఎందుకు పడుతోంది? అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. అధికారాన్ని సాధించుకోవాలంటే ఎన్నికలు ఎదుర్కొనాలి కానీ.. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు ఎందుకు? అదేమంటే.. కాంగ్రెస్ చేయలేదా? అంటారు. ఇలాంటి పనులు చేసే కాంగ్రెస్ దారుణ స్థితిని ఎదుర్కొంటోంది. మరి తమకూ అలాంటి స్థితి వచ్చినా ఫర్వాలేదని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. అందుకేనేమో ఈ విపరీత బుద్ధి! 

Show comments