చంద్రబాబు సర్వే.. ఇప్పుడెందుకు తొందర.?

2017 జూన్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడాలనుకున్నవారంతా, అక్కడికి వెళ్ళిపోతే అక్కడే స్థానికత ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రం నుంచి ఉత్తర్వుల్ని ఆఘమేఘాల మీద తెప్పించుకున్న విషయం విదితమే. ఇంకోపక్క హైద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు, అమరావతికి వెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారు. తరలింపు జులై 27 నాటికి పూర్తవ్వాల్సిందేనని ఓ పక్క చెబుతూనే, గడువు పొడిగించేందుకు ఆస్కారముందంటూ లీకులు పంపుతుండడం గమనార్హం. 

స్థానికతకు సంబంధించి డెడ్‌లైన్‌ ఇంకా ఏడాది వున్న దరిమిలా, చంద్రబాబు సర్కార్‌ ఇప్పుడెందుకు హడావిడిగా పల్స్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు.? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాని విషయం. గతంలో తెలంగాణలోనూ సముగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఆ సర్వే ఉద్దేశ్యం వేరు, జరిగిన తీరు వేరు. కోర్టు మొట్టికాయలతో సర్వే లక్ష్యం అటకెక్కింది. తెలంగాణలో ఆంధ్రోళ్ళెంతమందో తేల్చడానికి ఆ సర్వేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. అలా ఆ సర్వేకి విపరీతమైన ప్రచారం జరిగి, తూతూ మంత్రంగా ముగిసింది. అయినప్పటికీ, ఆ సర్వే దేశం దృష్టిని ఆకర్షించిందనుకోండి.. అది వేరే విషయం. 

అచ్చం అలాంటిదేనని జనం ఎక్కడనుకుంటారోనని, హైటెక్‌ బాబు, 'స్మార్ట్‌ పల్స్‌ సర్వే..' అనే పేరు పెట్టారు. ట్యాబ్‌లు, ఐపాడ్‌లు వాడేస్తారట స్మార్ట్‌ పల్స్‌ సర్వే కోసం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా? ప్రజల ఆర్థిక స్థితిగతులేమిటి? ఇలాంటి ఇరవై అంశాల్ని ఈ సర్వేలో 'క్వశ్చన్స్‌'గా పొందుపర్చారు. అంటే, మొత్తంగా ఈ సర్వే ద్వారా సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుందన్నమాట. 

ఇదే సర్వే తెలంగాణలో జరిగినప్పుడు అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కారణం అందరికీ తెల్సిందే. తెలంగాణలో సీమాంధ్రులపై తెలంగాణ సర్కార్‌ ఎక్కడ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్న అనుమానమే దానికి కారణం. స్థానికతపై కేసీఆర్‌ సర్కార్‌ మొదట్లో పితలాటకం పెట్టడంతోనే ఆ ఆందోళన, అనుమానాలు వెల్లువెత్తాయనుకోండి.. అది వేరే విషయం. 

ఇప్పుడు ఇదే ఆందోళన, మళ్ళీ తెలంగాణలో వ్యక్తమవుతోంది. జూన్‌ 2, 2017 నాటికి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోదామనుకుంటున్న కొన్ని కుటుంబాలు, చంద్రబాబు నిర్వహించే స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో పాల్గొనాలా.? వదా.? అన్న విషయమై కిందా మీదా పడాల్సి వస్తోంది. అక్కడి స్థానికత కావాలంటే సర్వేలో పాల్గొనడమే మంచిదన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. మరోపక్క, 20 పాయింట్లతో కూడిన సర్వే అనగానే, వున్న పథకాల్ని పీకేస్తారా.? అనే అనుమానాకూ ఆస్కారమేర్పడుతోంది. 

ఇప్పుడే చంద్రబాబు స్మార్ట్‌ పల్స్‌ సర్వేపై ఎందుకింత తొందరపడ్తున్నారు.? సర్వేలో పాల్గొనని వారికీ ముందు ముందు స్థానికత ఇస్తారా.? ఈ సర్వేని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుంది.? ఎలా వాడుకుంటుంది.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Show comments