స్పీడు తగ్గాలని రాజమౌళి చెబుతూనే వుంటారు

ఈగ సినిమాతో పంపిణీ రంగం నుంచి నిర్మాతగా మారారు సాయి కొర్రపాటి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అందిస్తూనే, పంపిణీ రంగంలో కూడా సంచలనాలు నమోదు చేస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ లు పంపిణీ చేస్తూనే, యంగ్ హీరో నాగా చైతన్యతో సినిమా నిర్మిస్తూనే, జగపతి బాబు కీలకపాత్రలో నటించిన పటేల్ సార్ సినిమా కూడా నిర్మించారు. ఇలా వైవిధ్యమైన సినిమా ప్రయాణం సాగిస్తున్న సాయి కొర్రపాటితో చిట్ చాట్.

చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా చటుక్కున రంగంలోకి దూకేస్తారు సాయి కొర్రపాటి అని ఇండస్ట్రీలో టాక్. మీరేమంటారు?

సినిమా అని కాదండీ. ఏ నిర్ణయమైనా చకచకా తీసుకోవడం అన్నది మొదట్నీంచీ అలవాటు. ఇక్కడా అదే అలవాటైపోయింది.

దీనివల్ల కాస్త దెబ్బలు కూడా తగుల్తున్నాయేమో?

తప్పదండీ. కానీ డబ్బులు వచ్చాయా లేదా అన్నది పక్కన పెడితే, చెడ్డ సినిమా అందించారు, లేదా చెడ్డ సినిమా తీసారు అని ఇంతవరకు అనిపించుకోలేదు.

మనమంతా లాంటి సినిమా కమర్షియల్ గా విఫలమైనపుడు బాధ పడ్డారా?

మన ప్రయత్నం మనం చేసాం. మరీ సినిమాలో మంచి తనం ఎక్కువైనా జనం చూడరేమో అనిపించింది. ఆ సినిమాలో మరీ అతి మంచి తనం వుందేమో అనిపించింది. ఎందుకంటే చూసిన వాళ్లు ఎవరూ బాగాలేదు అనలేదు. కానీ చూడాల్సినంత మంది చూడలేదు. అంటే ఏదో తేడా వుందని అనుకోవాల్సి వచ్చింది.

భారీ రేట్లకు సినిమాలు కొనడం, మంచి సినిమా అంటే చాలు, బ్యానర్ లో విడుదల చేయడం ఇలాంటివి అన్నింటి వెనుక ధైర్యం మీ మిత్రుడు రాజమౌళి యేనా?

(నవ్వేస్తూ) ఆయనా చెబుతూనే వుంటారండీ. సాయి గారూ మీరు స్పీడు తగ్గించుకోవాలని. అయినా అలవాటైపోయింది.

పటేల్ సార్.. జగపతిబాబును మళ్లీ హీరో చేయాలని ఎందుకు అనిపించింది?

లెజెండ్ సినిమా మాదే. మేమే ఆయనను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మార్చాం. ఆయనకు సూటయిన పాత్ర కాబట్టి, మళ్లీ ఆయన్నే హీరోను చేసాం.

ఇదే సినిమా బాలయ్యతో చేసి వుంటే పెద్ద సినిమా అయ్యేది...అని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి?

దానికి నేనేం చెప్పను. కానీ, ఇప్పుడు కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో వుంటుంది. రేపు చూసాక మీరే చెప్తారు. జగపతి బాబు నటుడిగా విశ్వరూపం చూపించారు. ఇది కూడా పెద్ద సినిమానే అవుతుంది.

జగపతి బాబు ఈ సినిమా నిర్మాణంలో పార్టనర్ అని, అందుకే అంత ఆసక్తి కనబరుస్తున్నారని టాక్ వుంది?

నిజానికి నా కన్నా ఈ సినిమాకు కష్టపడింది జగపతి బాబే. హీరో, నిర్మాత, దర్శకుడు అన్నీ తానే అయినంతగా కష్టపడ్డారు. అంతే తప్ప, పార్టనర్ లాంటి వ్యవహారాలు ఏవీ లేవు.

బాలయ్య తో, మోక్షజ్ఞతో సినిమాలు ఎప్పుడు ?

అన్నీ వుంటాయి. అన్నీ కుదిరితే బాలయ్య బాబుతో ఈ ఏడాదే సినిమా స్టార్ట్ చేస్తాం. మోక్షజ్ఞతో ఎప్పుడు అన్నది మాత్రం బాలకృష్ణ గారే ప్రకటిస్తారు.

చిన్న సినిమాలు తీసే వారందరూ ఇప్పుడు మీ బ్యానర్ లో తమ సినిమాలు విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ తాకిడి మీకు తెలుస్తోందా?

రోజుకు కనీసం నాలుగు ఫోన్లు, నాలుగు మీటింగ్ లు అవే వుంటున్నాయి. కానీ ఏ సినిమా ఆడుతుందో? ఏ సినిమా ఆడదో జడ్జ్ చేయడం కష్టంగా వుంది. రెండు రెళ్లు ఆరు మంచి సినిమా అనుకున్నాను. చూసిన వాళ్లు బాగానే వుంది కానీ స్టార్ కాస్ట్ సరిపోలేదు అంటున్నారు. అందువల్ల కాస్త ఇబ్బందిగానే వుంది.

సినిమా అన్నది కమర్షియల్ వ్యవహారం. కానీ గుళ్లు గోపురాలు, డొనేషన్లు, భక్తి పుస్తకాల ప్రచురణ ఇదంతా వేరు. కానీ మీరు రెండింటిలోనూ కీలకంగా వున్నారు?

సినిమా నా వృత్తి. భక్తి, పుస్తకాలు అన్నీ ప్రవృత్తి. నేను ఎక్కువగా చదువుకోలేదు. అందుకే ఎవరినన్నా చదివించడం ఇష్టం. మంచి పుస్తకాలు అందించి, నలుగురి చేతా చదివించడం ఇష్టం. నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. వచ్చాను. అలాంటపుడు అయినా భగవంతుడి పట్ల ఆ మాత్రం విశ్వాసం, భక్తి వుండాలి కదా?

కమింగ్ బ్యాక్ టు పటేల్ సార్. ఈ సినిమా పై మీ అంచనాలు ఏ మేరకు?

ఈ సినిమా మా బ్యానర్ లో చాలా పెద్ద సినిమా అవుతుంది. సుమారు నాలుగు వందలకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. సినిమా పూర్తయ్యేసరికి, జగపతి బాబు ఏం చేసాడ్రా అని ప్రేక్షకులు కచ్చితంగా అంటారు. అన్ని రకాల జోనర్లు టచ్ చేసే సినిమా ఇది. అంతకన్నా చెపితే ఎక్కువ చెబుతున్నా అనుకుంటారు. మీరే చూసి చెప్పండి.

Show comments