దూకుడే శశి కొంప ముంచిందా!

‘నేనూ సింహాన్నే..’ అంది ఆమె! తీసుకెళ్లి ఇప్పుడు కారాగారంలో పెడుతున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ కు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది సుప్రీం కోర్టు. కర్ణాటక హై కోర్టు తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. జయలలిత, శశికళ, సుధాకరణ్, ఇళవరసిలు దోషులే అని కోర్టు స్పష్టం చేసింది. 

విశేషం ఏమిటంటే.. అత్యంత రాజకీయ వేడి మధ్యన శశికళకు ఈ శిక్ష ఖరారు అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొన్ని అడుగుల దూరంలో కనిపించిన ఆమె.. ఒక్కసారి బెంగళూరు జైల్ రోడ్డుకు వెళ్లాల్సి వస్తోంది. మూడున్నర సంవత్సరాల జైలు శిక్షను ఆమె అనుభవించాల్సి ఉంది. అలాగే పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా శశి కోల్పోయింది.

జయమరణానంతరం శశికళ జీవితం ఇంత త్వరగా ఇలాంటి టర్న్ తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. మరి పరిణామాలు ఇలా తలెత్తడానికి కారణం శశికళ దూకుడే అని చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఆమె ఇంతగా పాకులాడకపోయుంటే.. కేంద్రంతో సంధి చేసుకుని ఉంటే, వారికి అణిగిమణిగి ఉండి ఉంటే.. ఈ రోజు ఇలాంటి తీర్పు వచ్చేది కాదనే అభిప్రాయమే వ్యక్తం అవుతోంది!

ఈ కేసులో ఇప్పటికే భిన్నమైన తీర్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం ఆమె దూకుడుగా ముందుకు వెళ్లడం, బీజేపీకి అది ఇష్టం లేకపోవడంతో.. ఈ కేసులో తీర్పు మళ్లీ తిరగబడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

అయితే ఇక్కడ మరో వాదన కూడా ఉంది.. ఎలాగూ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని ఊహించే శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని వేగంగా చేరుకునే యత్నం చేసిందనే మాట వినిపిస్తోంది. ఆ పీఠంలో కూర్చొనేస్తే.. కేంద్రం తన వైపు మొగ్గు చూపకతప్పదనే లెక్కతో ఆమె పీఠం కోసం గట్టియత్నించిందనే మాట వినిపిస్తోంది. అయితే ఆ ప్రయత్నానికి కేంద్రం అడ్డుపుల్ల వేసి, శశిని జైలుకు పంపే ఏర్పాటు చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి కొంత కాలంగా అత్యంత అనూహ్యంగా మారిన తమిళ రాజకీయాల్లో ఇదో అనూహ్య పరిణామం. మరి ఇకపై ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో! 

Show comments