యాంకర్‌ సుమ.. కొత్త అవతారం

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ సుమ కొత్త అవతారమెత్తుతోంది. అదీ సింగర్‌గా. సాయిధరమ్‌ తేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విన్నర్‌' కోసం సింగర్‌గా మారింది సుమ. ఈ విషయాన్ని 'విన్నర్‌' మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ వెల్లడించాడు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సుమ పాడిన 'విన్నర్‌'లోని సాంగ్‌ విడుదల కానుంది. 

ఓ యాంకర్‌ చేసిన ఐటమ్‌ సాంగ్‌కి ఇంకో యాంకర్‌ గాత్రదానం చేయడం విశేషమే మరి. విన్నర్‌లో 'సూయా సూయా..' అంటూ సాగే ఈ ఐటమ్‌ సాంగ్‌లో బుల్లితెర హాట్‌ బ్యూటీ అనసూయ, సాయిధరమ్‌ తేజతో కలిసి చిందులేసింది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ పాటని (ఆడియో సింగిల్‌) కాస్సేపట్లో (సాయంత్రం ఏడు గంటలకి) తన సోషల్‌ మీడియా అక్కౌంట్‌ ద్వారా విడుదల చేయబోతున్నాడు. 

సుమ చాలాకాలం క్రిందట ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై అలాంటి సాహసం చేయలేదు. అయితే, బుల్లితెరపై మాత్రం మకుటం లేని మహారాణిలా వెలిగిపోతోంది సుమ. ఎంతమంది కొత్త కొత్త యాంకర్స్‌ వస్తున్నా, బుల్లితెరపై సుమ స్టార్‌డమ్‌ ఏమాత్రం తగ్గలేదు. సినిమా ఫంక్షన్లకీ స్టార్‌ యాంకర్‌గా సుమ పేరు మార్మోగిపోతోన్న విషయం విదితమే. ఇప్పుడిక సుమ సింగర్‌గా మారడం విశేషమే మరి.

Show comments