అది నిజమేనా బోయపాటీ.!


బోయపాటి శ్రీను.. తెలుగు సినీ రంగంలో టాప్‌ డైరెక్టర్లలో ఒకడు. కమర్షియల్‌ సినిమాలకు తనదైన మాస్‌ టచ్‌ అద్ది, సూపర్‌ హిట్స్‌ సొంతం చేసుకోవడం ఈ దర్శకుడికి వెన్నతో పెట్టిన విద్య. ఇటీవలే 'సరైనోడు'తో సూపర్‌ హిట్‌ని అందుకున్న బోయపాటి శ్రీను, సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ అప్పుడప్పుడూ అలా అలా మెరుస్తుంటాడు. 

అందరికీ తెల్సిన విషయమే, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు బోయపాటి. బహుశా, బాలకృష్ణ ద్వారా చంద్రబాబుతో సాన్నిహిత్యం ఏర్పడిందేమో.! కారణం ఏదైతేనేం, చంద్రబాబు తనకు ఎలాంటి ప్రమోషనల్‌ ఐడియాస్‌ కావాలన్నా ఠక్కున బోయపాటిని పిలిపించుకుంటుంటారట. అలా గోదావరి పుష్కరాల కోసం బోయపాటి డైరెక్షన్‌లోనే చంద్రబాబు నానా హంగామా చేశారు. ఆ హంగామానే, 29 మంది మృతికి కారణమయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, ఆ హంగామాకీ, తనకూ, పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకీ అసలు సంబంధమే లేదని ఆ తర్వాత బోయపాటి బుకాయించినా, బోయపాటి - చంద్రబాబు కాంబినేషన్‌ 29 మంది ప్రాణాలు తీసేసిందన్నది కాదనలేని వాస్తవం. ఇందులో బోయపాటి తప్పు ఎంత.? అన్నది పక్కన పెడితే, చంద్రబాబు పబ్లిసిటీ యావ అమాయకుల ప్రాణాల్ని బలిగొందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ బోయపాటి పేరు తెరపైకి వచ్చింది. చంద్రబాబు సర్కార్‌ బోయపాటిని సంప్రదించడం, 'గౌరవ రెమ్యునరేషన్‌' అందుకుని మరీ, బోయపాటి ఆ పనుల్ని పర్యవేక్షించడం.. ఇలా ప్రక్రియ అయితే నడుస్తోంది. కానీ, ఎక్కడా తన పేరు పైకి రాకుండా బోయపాటి 'సకల జాగ్రత్తలు' తీసుకుంటున్నాడట. బోయపాటికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించుకుంటున్న 'తాయిలం' చాలా ఎక్కువేనని సినీ, రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

నిజమేనా.? ఈసారి గోదావరి పుష్కరాల్లోలా అమాయకుల ప్రాణాల్ని చంద్రబాబు - బోయపాటి కాంబినేషన్‌ బలి తీసుకోకుండా వుంటుందా.? వేచి చూడాల్సిందే.

Show comments