సీఎం రమేశ్ ఛాలెంజ్.. వైఎస్ జగన్ కు షాకిస్తారా?!

ఇప్పటికే సీఎం రమేశ్ సవాలు చేశాడు.. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి తన అభ్యర్థిని గెలిపించుకోవాలని ఈయన సవాలు విసిరాడు. కడప జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల సభ్యుల ఓట్లతో ఎన్నికయ్యే ఎమ్మెల్సీ అభ్యర్థి ని తాము గెలిపించుకుంటామని  సీఎం రమేశ్ అన్నాడు. ఈ విషయంలో వైకాపా అధినేతకు రమేశ్ సవాల్ విసిరాడు. 

మరి లెక్క ప్రకారం చూసుకుంటే.. కడప జిల్లా స్థానిక సంస్థల్లో వైకాపా సభ్యులదే మెజారిటీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వాళ్లలో వైకాపా కు చెందిన వాళ్లే ఎక్కువమంది. ఈ  లెక్కతో చూసుకుంటే..  ఈ ఎమ్మెల్సీ పీఠాన్ని వైకాపా సునాయాసంగా సొంతం చేసుకుంటుంది. అయితే.. ఏ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్సీ అదే పార్టీకి ఓటు వేస్తాడనే లెక్క చెల్లుతుందా? అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. వైకాపా తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లోనే ఇరవై మంది తెలుగుదేశం వైపున చేరిపోయారు! మరి ఎమ్మెల్యేలే అలా అనైతికంగా వ్యవహరిస్తూ వ్యభిచరిస్తున్నప్పుడు… ఎంపీటీసీలు, జడ్పీటీసీ  సభ్యులు ఎంత? ఇప్పటికే ఫిరాయింపు రాజకీయాల్లో ఆరితేరిపోయిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కూడా సవాలు విసురుతోందంటే.. తమకు బలం లేకపోయినా.. గెలుస్తాం.. అని సవాలు అంటున్నారంటే.. వైకాపా సభ్యులను తనవైపుకు తిప్పుకుంటామన్న కాన్ఫిడెన్సే తప్ప మరో రీజన్ లేదు!

ఈ విషయంలో రచ్చకు ఎక్కి మరీ సీఎం రమేశ్ సవాలు విసురుతున్నాడు. ఇక వైకాపా తరపు నుంచి ఇప్పటికే అభ్యర్థి కూడా ఖరారు కావడంతో ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. తన బాబాయ్ .. వైఎస్ వివేకానంద రెడ్డి ని జగన్  ఇక్కడ నుంచి అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సొంత జిల్లా.. అందునా.. తన ఇంటి మనిషిని పోటీకి దింపడంతో కచ్చితంగా గెలిపించుకోవాల్సిన పరిస్థితిలోకి పడిపోయాడు జగన్ మోహన్ రెడ్డి.

మెజారిటీ స్థానిక సంస్థల సభ్యులు ఫ్యాన్ గుర్తుమీద గెలిచిన వాళ్లున్నారు.. రాయలసీమన అందునా కడప జిల్లాలో పోటీ.. జగన్ సొంత బాబాయ్ పోటీలో దిగుతున్నాడు.. ఇవి వైకాపాకు సానుకూలాంశాలు. ఈ పరిస్థితుల నడుమ కూడా తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తోంది. ఎంపీ హోదాలోని వ్యక్తి… వైకాపాపై గెలుస్తామంటున్నాడు!

మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు? అనే విషయం గురించి వాకబు చేస్తే మాత్రం ఇంకా వాళ్లు ఒక కంక్లూజన్ కు రాలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. దాదాపు ఐదారు మంది టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో బీటెక్ రవి, మేడా రఘునాథరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు టీడీపీ తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే.. టీడీపీ తరపున తనకు టికెట్ ఇస్తే ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని అయినా గెలుస్తానని ఒక వ్యాపార వేత్త ప్రతిపాదన పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో నిర్ణయం చంద్రబాబు కోర్టుకు చేరినట్టుగా తెలుస్తోంది.

బాబు ఎవరిని ఓకే చేస్తే.. వాళ్లు టీడీపీ తరపున నిలబడతారు. వైకాపా తరపు నుంచి మాత్రం కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. జిల్లాపై పట్టున్న వివేక విజయం సునాయాసమే అంటోంది. అధికారం మాత్రమే తెలుగుదేశం ఆయుధం.. దాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కు షాక్ ను ఇవ్వగలదేమో చూడాలి!

Show comments