10కోట్లతో ఆర్కే రెడీ.. లోకేష్ సిద్ధమేనా.?

'10కోట్ల రూపాయలు చెల్లించడానికి నేను సిద్ధం..' అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం సృష్టించిన సదావర్తి భూముల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరి, ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలోకి చేరింది. మొత్తం 88 ఎకరాల భూముల్ని అధికార పక్షం, కేవలం 22కోట్లకే ధారాదత్తం చేసిన దరిమిలా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

'ప్రభుత్వం నిర్దేశించిన 22కోట్ల కంటే 5కోట్లు ఎక్కువ చెల్లిస్తే, ఆ భూముల్ని మీకే చెందేలా ఆదేశాలిస్తాం..' అంటూ ఈ కేసులో హైకోర్టు, ఎమ్మెల్యే ఆర్కేకి సూచించడంతో, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సమాధానమిచ్చారు ఈ రోజు. వారం రోజుల్లోపే పది కోట్లు చెల్లిస్తానని ఆర్కే, న్యాయస్థానానికి తెలపడం, దేవాదాయ శాఖ కమిషనర్‌ పేరు మీద ముందుగా 10కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేయడం జరిగిపోయాయి. 

ఇక, ఈ వివాదంలో మంత్రి నారా లోకేష్‌ ఎంటరయి తనదైన స్టయిల్లో అడ్డంగా బుక్కయిపోయారు. 'మొత్తం 27కోట్లు మీరే చెల్లించాలి.. బినామీలతో అంటే కుదరదు.. ఐటీతో దాడులు చేయిస్తాం..' అంటూ హెచ్చరించిన విషయం విదితమే. '10కోట్లు చెల్లించడానికి మేం రెడీ..' అనడం ద్వారా ఆర్కే, మంత్రి నారా లోకేష్‌కి సవాల్‌ విసిరినట్లయ్యింది. 

ఇక్కడ, ఆర్కే ఆ భూముల్ని కొనడం, కొనకపోవడం అన్నది వేరే విషయం. 88 ఎకరాల భూముల్ని అప్పనంగా, ప్రభుత్వం అప్పగించిందన్న విషయం బట్టబయలయిపోయింది. ఆర్కేపై ఐటీ దాడులు చేయించడం సంగతి తర్వాత, 88 ఎకరాల భూమిని తక్కువ ధరకు బొక్కేద్దామనుకున్నవారెవరు.? అలా వారు బొక్కేయడానికి ఆస్కారం కల్పించడం ద్వారా, తమ బొక్కసంలో అవినీతి సొమ్ము నింపుకోవాలనుకున్నదెవరు.? ఇది తేలాలిప్పుడు. Readmore!

Show comments

Related Stories :