ముద్రగడ వస్తానంటే చంద్రబాబు వద్దంటారా


పాపం ముద్రగడ పద్మనాభం.. 14 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. చేశారు.. అంటే చేశారంతే. ఆయన ఏ తరహా దీక్ష చేశారో, ఎందుకు చేశారో, దీక్ష సాధించి ఏం సాధించారో ఆయనకైనా తెలుసో లేదో. ప్రస్తుత ప్రజాస్వామ్యం నిరాహార దీక్షలకు సరికొత్త అర్ధాన్ని నిర్వచిస్తోంది. నిరాహార దీక్ష చేయడాన్ని ఆత్మహత్యాయత్నంగా భావిస్తోంది. అధికారంలో వున్నవారికి ఇది చాలా పెద్ద వెసులుబాటు. 

అదిగో, ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు.. టెంట్‌ లేపేస్తున్నాం.. అంటూ దీక్షా శిబిరం నుంచి, ఆసుపత్రికి దీక్ష చేస్తున్నవారిని తరలించేయడం సర్వసాధారణమైపోయింది. ముద్రగడ పద్మనాభం దీక్ష కూడా అలానే అయ్యింది. చిత్రంగా దీక్ష ప్రారంభించిన కొద్ది గంటల్లోనే.. అదీ కూడా మూడు నాలుగు గంటల్లోనే ఆయన్ను ఆసుపత్రికి తరలించేశారు. అక్కడ ఏం జరిగింది.? అన్నది ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. 

అసలు ముద్రగడ ఆసుపత్రిలో దీక్ష చేశారా.? లేదా.? అన్నది ఎవరికీ తెలియదు. చేశారంతే. దీక్ష చేశారు, విరమించారు.. కొన్నాళ్ళు రెస్ట్‌ తీసుకున్నారు.. ఇప్పుడిప్పుడే మీడియా ముందుకొస్తున్నారు.. మళ్ళీ చంద్రబాబుపై విరుచుకుపడ్తున్నారు. నిజానికి, ముద్రగడతో ఆసుపత్రిలో దీక్ష కొనసాగించినట్లుగా బిల్డప్‌ ఇప్పించి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన 'పొలిటికల్‌ ట్రిక్స్‌' ప్లే చేస్తే, ఇక్కడ ముద్రగడకీ ఆయన కాస్తో కూస్తో క్రెడిట్‌ ఇచ్చేశారన్నది నిర్వివాదాంశం. 

దీక్ష తర్వాతి పరిణామాలు చూస్తే, ముద్రగడ - చంద్రబాబు మధ్య పరస్పర అవగాహనతోనే అంతా జరిగిందనే విషయం అర్థమవుతుంది. కానీ, ముద్రగడ ఇంకా చంద్రబాబుని విమర్శిస్తూనే వున్నారు. 'నాతో మాట్లాడటానికి చంద్రబాబు ఇష్టపడటంలేదు..' అంటూ తాజాగా ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యో పాపం, మాజీ మంత్రిగా ముద్రగడ పద్మనాభం, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరితే చంద్రబాబు ఇవ్వకుండా వుంటారా.? టీడీపీలో చేరతానని అనుచరులతో మెసేజ్‌ పంపితే, చంద్రబాబు పల్లకీ పంపి మరీ, ముద్రగడను తన వద్దకు రప్పించుకోరా.? అంతెందుకు, ఇంకోసారి దీక్ష చేస్తానంటే, ఆసుపత్రిలో ముందుగానే సకల సౌకర్యాలూ కల్పించకుండా వుంటారా.?

ఇంతకీ కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమం ఏమైంది ముద్రగడ పద్మనాభం గారూ.? రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సాక్షిగా చంద్రబాబు పాదాల వద్ద తాకట్టుపెట్టేయలేదు కదా.!

Show comments