అనుమతి కావాలంటే ఇస్తాం!

పాదయాత్ర చేసేందుకు ముద్రగడ పద్మనాభం అనుమతి కోరితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు పాదయాత్ర చేసిన సందర్భంలో కాపులను బీసీలుగా గుర్తిస్తామని చెప్పిన మాట వాస్తవమేనన్నారు.

ఆ హామీని చంద్రబాబు నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు. అందులో భాగంగానే కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని, విద్యానిధి పథకాన్ని కాపు యువతకు అమలు చేస్తున్నారన్నారు. త్వరలో మంజునాథ్‌ కమీషన్‌ నివేదిక ఇవ్వనుందని, దాని ఆధారంగా కాపులకు చంద్రబాబు న్యాయం చేస్తారని పేర్కొన్నారు.

ముద్రగడ మాటలను కాపులు నమ్మవద్దని ఆయన వెంట ఎవరూ వెళ్ళవద్దని సూచించారు. అనుమతి తీసుకోకుండా పాదయాత్ర చేస్తానంటే సహించేది లేదన్నారు. ఇటువంటి చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు.

పాదయాత్రకు అనుమతి తీసుకోకుండా గలాటా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ముద్రగడపై ధ్వజమెత్తారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం 144సెక్షన్‌, 30పోలీస్‌ ఏక్ట్‌లను అమలు చేస్తోందన్నారు. కాపు యువత ముద్రగడ ఉద్యమాల్లో పాల్గొనరాదని సూచించారు.

కాపులకు ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని గ్రహించిన ముద్రగడ ఆ క్రెడిట్‌ తనకు చెందాలన్న దురుద్దేశ్యంతో ఇటువంటి ఆందోళన కార్యక్రమాన్ని పాల్పడుతున్నారని చినరాజప్ప విమర్శించారు. 

Show comments