ఎక్కడున్నావ్‌ దివాకరా.!

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిపై చెయ్యి చేసుకున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని నేషనల్‌ మీడియా కడిగి పారేస్తోంటే, అధికార తెలుగుదేశం పార్టీ తమ ఎంపీని వెనకేసుకురాలేక నానా తంటాలూ పడ్తోంది. 'ఏదో ఆవేశంలో జరిగిన చిన్న సంఘటన మాత్రమే..' అంటూ టీడీపీ నేతలు బుకాయించే ప్రయత్నమైతే చేస్తున్నారు.

కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు అయితే, 'రెడ్డిగారు మనోరే..' అంటూ వివాదాన్ని చల్లార్చేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్న విషయం విదితమే. 

కానీ, జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పుడెక్కడున్నారు.? 'నన్ను గబ్బు పట్టించాల్సినంతగా గబ్బుపట్టించేశారుగా..' అని మీడియా మీద గుస్సా అయిన జేసీ దివాకర్‌రెడ్డి, విదేశాలకు చెక్కేశారిప్పుడు.

విమానయాన సంస్థలు చాలావరకు జేసీ దివాకర్‌రెడ్డి మీద ట్రావెల్‌ బ్యాన్‌ విధించాక, పార్లమెంటు సభ్యుడైన జేసీ దివాకర్‌రెడ్డి విదేశాలకు ఎలా వెళ్ళగలుగుతారు.? అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే. అక్కడ రాజుగారున్నారు కదా.. ఆయనే మొత్తం వ్యవహారాన్ని మేనేజ్‌ చేసేసి వుండాలి.  Readmore!

'అబ్బే, అదేం లేదు.. బ్యాన్‌ విధించింది కొన్ని సంస్థలే.. జేసీ, విదేశాలకు చెక్కేసింది విదేశీ ఎయిర్‌లైన్స్‌లో..' అనే ఇంకో వాదనా విన్పిస్తోందనుకోండి.. అది వేరే విషయం. 

సరే, ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిపై జేసీ దివాకర్‌రెడ్డి వివాదం సంగతి పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌ వివాదం నడుస్తోంది. జేసీ బ్రదర్స్‌ నిర్వహిస్తోన్న దివాకర్‌ ట్రావెల్స్‌పైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంపీ కేశినేని నాని, ఇటీవలే తన కేశినేని ట్రావెల్స్‌ని మూసేసి, ప్రైవేటు ట్రావెల్స్‌పై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దానికి కౌంటర్‌గా, పలు ట్రావెల్స్‌ సంస్థలు, 'అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కేశినేని.. అవినీతి, అక్రమాల్లో ఆయనే మాకు ఆదర్శం..' అంటూ సెటైర్‌ వేసేశారు తాజాగా. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ట్రావెల్స్‌ సంస్థల్లో దివాకర్‌ ట్రావెల్స్‌ కూడా ఒకటి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో దివాకర్‌ ట్రావెల్స్‌కి చెందిన బస్సు ప్రమాదానికి గురై 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెల్సిన విషయాలే.

ట్రావెల్స్‌ యాజమాన్యాల కక్కుర్తే ఈ ప్రమాదాలకు కారణమని సాక్షాత్తూ ఎంపీ కేశినేని నాని నినదిస్తున్నారు. అయినా ఈ ఎపిసోడ్‌లో జేసీ దివాకర్‌రెడ్డిగానీ, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిగానీ స్పందించకపోవడం గమనార్హం. 

ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపడం జేసీ ప్రభాకర్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ అధికారులపై చెలరేగిపోతుంటారాయన. చిత్రంగా ఈ ఎపిసోడ్‌లో 'దివాకర్‌' ట్రావెల్స్‌ సైలెంటయిపోయిందెందుకో.!

Show comments