ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సందడి చేశారు. రాజధాని అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో కలియతిరిగారు. వివిధ శాఖల కార్యాలయాల్ని పరిశీలించారు. మంత్రి యనమల రామకృష్ణుడుతో భేటీ అయ్యారు. తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మితమవుతున్న అసెంబ్లీ భవనాన్ని కూడా పరిశీలించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.
ఇంతకాలం ఎందుకు లేటయ్యింది.? అన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబే సమాధానం చెప్పాలట. రాజధాని ఎంపిక దగ్గర్నుంచి, శంకుస్థాపన, తాత్కాలిక సచివాలయ నిర్మాణం, భూ సమీకరణ.. ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల్ని తీసుకుందనీ, ప్రతిపక్షాన్ని సంప్రదించలేదని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
మరోపక్క, రైతులు కొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల వద్దకొచ్చి తమ గోడు వెల్లగక్కుకున్నారు. గ్రామకంఠాల విషయంలో సీఆర్‌డీయే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనీ, తమను రోడ్డున పడేస్తున్నారంటూ వెలగపూడికి చెందిన పలువురు గ్రామస్థులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు. వారి సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
మొత్తమ్మీద, చాలాకాలం తర్వాత.. ఆ మాటకొస్తే, తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సందడితో, సచివాలయ ప్రాంగణానికి కొత్త కళ వచ్చిందనే చెప్పాలి. ఎమ్మెల్యేల రాక నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధుల్ని కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యేలు, మంత్రి యనమల రామకృష్ణుడుకి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల వెలగపూడి సందర్శన ముఖ్య ఉద్దేశ్యమిదే.
ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. అలాగే, ఏదో ఒక రోజు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా సచివాలయానికి రాకుండా వుండరు కదా.! శీతాకాల సమావేశాలు గనుక ప్రభుత్వం చెబుతున్నట్లు వెలగపూడిలోనే జరిగితే, ఆ రోజు త్వరగా వచ్చినట్లే. కానీ, ప్రస్తుతానికి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హైద్రాబాద్‌లోనే జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.