మోడీకి ఓ గుడ్‌ న్యూస్‌: ఇదిగో ప్యాకేజీ

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా కేంద్రం ఆలోచించడంలేదాయె. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం ప్యాకేజీ కోసం కసరత్తు జరుగుతోందంటున్నారు. 'ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ రూపంలో కేంద్రం సహాయం చేస్తామంటే ఎలా కాదనగలం.?' అని ఏపీ టీడీపీ నేతలు హడావిడి చేస్తూ, ప్రత్యేక హోదాని అటకెక్కించేస్తోన్న విషయం విదితమే. 

ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీకి చాలా పెద్ద ఊరట. అదేంటంటే, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ఏమీ ఇవ్వకపోయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'ప్యాకేజీ' ఇచ్చేయగలరట. అనంతపురం జిల్లాకి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 6,554 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించేశారు. అదెలా.? అనడక్కండి. అదంతే. చంద్రబాబు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తారు. 

ఎలా ఇస్తారు.? హెరిటేజ్‌ సంస్థని పణంగా పెడతారా.? అని సామాన్యులెవరికైనా అనుమానాలు రావొచ్చు. ఇంకా నయ్యం, చంద్రబాబు తన జేబులోంచి ఒక్క రూపాయి కూడా తియ్యరంతే. కానీ, ఆ ఆరువేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రం, అనంతపురం జిల్లాకీ ప్యాకేజీ రూపంలో దక్కుతుంది. అవును మరి, చంద్రబాబు చేతిలో అల్లావుద్దీన్‌ అద్భుత దీపం లాంటిదేదన్నా వుండే వుండాలి. 

ఇకనేం, చంద్రబాబే తన రాష్ట్రంలోని జిల్లాలకు ప్యాకేజీలు ప్రకటించేసుకుంటోంటే, కేంద్రం ఎందుకు ప్రత్యేక హోదా గురించి అయినా, ప్రత్యేక ప్యాకేజీ గురించి అయినా ఆలోచించాలట.? అన్న భావన ప్రధాని నరేంద్రమోడీకి కలిగితే అది ఆయన తప్పు కాదు. చంద్రబాబు చేసే పనులేమో, ఇలా వుంటున్నాయి. పైగా, కేంద్రం 'మా రెక్కల్ని విరిచేస్తోంది..' అంటూ నిష్టూరాలూ.!  Readmore!

తన గొప్ప కోసం చంద్రబాబు ఏదైనా మాట్లాడతారు. ఆ మాటల కారణంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలిసినా ఆయన తగ్గరుగాక తగ్గరు. తగ్గితే ఆయన చంద్రబాబు ఎలా అవుతారు.? ఇచ్చేదా, చచ్చేదా.. నోటికొచ్చిన ఫిగర్‌ చెప్తారంతే. డౌటేమన్నా వుందా, రాష్ట్ర ప్రజానీకమంతా చంద్రబాబుని ఒక్కసారి నిలదీసి చూడండి, ఏ చెట్టుని దులిపి ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల్ని తీసుకొస్తారు.? అని.

కొసమెరుపు: అనంతపురం జిల్లాకేం ఖర్మ, అవసరమైతే కేంద్రానికే ప్యాకేజీలు ప్రకటించేయగలరు మన చంద్రన్న. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చంద్రబాబు ఎన్నయినా చెప్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా చంద్రబాబు ఇంత పెద్ద వట్టి హామీ ఇవ్వడం సిగ్గు చేటు.

Show comments